సినిమా ఇండస్ట్రీ ఓ ఎకో సిస్టమ్ పై నడుస్తుంటుంది. నిర్మాత – డిస్టిబ్యూటర్ – ఎగ్జిబీటర్.. ఈ ముగ్గురూ కలిసి పని చేస్తేనే సినిమా. లేదంటే లేదు. అయితే వీరి సఖ్యతకు బీటలు వారుతున్నాయి. రెంటల్, పర్సంటేజీ విధానాలపై అటు నిర్మాతలు, ఇటు ఎగ్జిబీటర్లు పట్టుపట్టుకొని కూర్చున్నారు. వరుస ప్రెస్ మీట్లూ, వాళ్లు మాట్లాడిన మాటలూ చూస్తుంటే, ఇప్పటికిప్పుడు ఈ పంచాయితీ తెగేలా కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దలు దిగి వచ్చి, న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాగవంశీ కూడా ఈ విషయానికి సంబంధించి ఓ హింట్ ఇచ్చారు. పరిస్థితి ఇలానే ఉంటే మెగాస్టార్ దగ్గరకే వెళ్లి, పరిణామాల్ని వివరిస్తామని చెప్పారు. అంటే.. ఈ ఇష్యూలోకి చిరుని లాగడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట.
ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కచ్చితంగా చిరంజీవి లాంటి పెద్ద మనిషి రావాల్సిందే. ఆయన మాటంటే అందరికీ గౌరవం ఉంది కాబట్టి, తప్పకుండా ఓ పరిష్కారం దొరుకుతుంది. కానీ ఒక్కటే సమస్య. ఇది రామ్ చరణ్ సినిమా. ఆయన బయటకు వచ్చి ఏం మాట్లాడినా ‘కొడుకు సినిమా కదా, ఇబ్బంది పడకూడదు అనుకొంటున్నారా’ అనే విమర్శలు వినిపించే ఛాన్స్ వుంది. సెట్యువేషన్ ఎలాగున్నా సరే, హ్యాండిల్ చేద్దామనుకొందామంటే ఆయన ఈ సినిమాకి నిర్మాత కూడా కాదు. మరి చిరు ఏం చేయగలరు?
నిజంగానే పర్సంటేజీ విధానం ఇస్తే తప్ప సినిమా విడుదల చేయం అని ఎగ్జిబీటర్లు తేలిస్తే – అప్పుడు పర్సంటేజీ సిస్టమ్ వస్తే `పెద్ది` నిర్మాత బాగా నష్టపోతాడు. అలాంటప్పుడు చరణ్‌ని పారితోషికం లో కొంత తిరిగి ఇవ్వమని మాత్రమే మెగాస్టార్ కోరగలరు. అది కూడా చరణ్‌కి ఇష్టమైతేనే. నాగవంశీ ఉద్దేశ్యం కూడా అదే కావొచ్చు. ఒకవేళ పర్సంటేజీ విధానం అమలు చేయాల్సివస్తే, ఆ మేరకు నష్టాన్ని చరణ్ పారితోషికంతో పూరిద్దామన్న ఆలోచనతో నాగవంశీ ఓ మాట విసిరేసి ఉండొచ్చు. లేదంటే చిరు వచ్చి, మాట్లాడితే… ఈ సమస్య ఇప్పటికిప్పుడు పరిష్కారం కాకపోయినా కొన్నాళ్లు హోల్డ్ అవుతుందని ఆశించి ఉండొచ్చు.
మొత్తానికి ఇప్పుడు అందరి దృష్టీ మెగాస్టార్ పై పడింది. ఆయన దగ్గరకు నిర్మాతలు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చిరు అందరి వాడు. చరణ్ సినిమా కదా అని నిర్మాతల వైపు మాట్లాడే రకం కాదు. ఎగ్జిబీటర్లు కూడా అదే నమ్ముతున్నారు. చిరు రంగంలోకి దిగితే – ఇద్దరికీ న్యాయం జరిగేలా చూస్తారన్న ధీమా పరిశ్రమ వర్గాల్లోనూ ఉంది. కాకపోతే అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది.
