ఏపీ రాజకీయాల్లో ఒకప్పుడు మూడు రాజధానుల మంత్రం పఠించిన వైసీపీ హఠాత్తుగా మావిగన్ అనే ఊహాజనిత రాజధానిని ప్రకటించింది. జగన్ రెడ్డి ప్రకటించిన ఆ రాజధాని కాస్తా ఇప్పుడు ఆ పార్టీకి మింగుడు పడని వ్యవహారంగా మారింది. అమరావతికి పోటీగా అత్యంత ఖర్చు తక్కువతో ఈ కారిడార్‌ను అభివృద్ధి చేయవచ్చని అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించినా, అది క్షేత్రస్థాయిలో ప్రజల ఆదరణ పొందకపోగా.. తీవ్ర స్థాయిలో ఎకసెక్కాలకు గురవుతోంది. సోషల్ మీడియాలో వస్తున్న సెటైర్లు, విమర్శలకు సమాధానం చెప్పుకోలేక ఇప్పుడు వైసీపీ శ్రేణులు ఈ అంశంపై వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాయి.
రెండూ ఒక్కటే కదా అంటున్న రోజా
అమరావతిని అవినీతి గనిగా అభివర్ణిస్తూ, దానికి ప్రత్యామ్నాయంగా మావిగన్ మోడల్‌ను తెరపైకి తెచ్చినప్పుడు వైసీపీ నేతలు ఆకాశమే హద్దుగా మాట్లాడారు. కానీ, అది కేవలం ఒక ఊహాజనిత పదంగానే మిగిలిపోయిందని, దానికి ఎలాంటి శాస్త్రీయ పునాది లేదని మేధావుల నుంచి వచ్చిన విమర్శలతో ఆ పార్టీ డిఫెన్స్‌లో పడింది. అసలు మావిగన్ అనే పేరు వినగానే జనాల్లో వస్తున్న నవ్వులు చూశాక, ఈ అంశంపై చర్చ పెడితే పరువు పోవడం ఖాయమని గ్రహించిన నేతలు.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. రోజా వంటి వారు సైతం ఇప్పుడు ఆ రెండు ప్రాంతాలు ఒక్కటే కదా అంటూ సర్దుబాటు మాటలు మాట్లాడుతుండటం ఆ పార్టీలో నెలకొన్న అయోమయానికి నిదర్శనం.
మావిగన్‌ను మర్చిపోయేలా చేస్తున్న వైసీపీ
అమరావతికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన గుర్తింపు ఇచ్చి, నిధులు కూడా మంజూరు చేస్తున్న తరుణంలో మావిగన్ ప్రస్తావన వైసీపీకి సెల్ఫ్ గోల్లా మారింది. ఒకవైపు అమరావతిలో పనులు శరవేగంగా జరుగుతుంటే, కేవలం ప్లాన్-బి అంటూ లేని కారిడార్ గురించి మాట్లాడటం వల్ల ప్రజల్లో విశ్వసనీయత తగ్గుతుందని ఆ పార్టీకి ఆలస్యంగా జ్ఞానోదయం అయినట్లు కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు మేధావులతో చర్చలు లేవు, సోషల్ మీడియాలో పోస్టులు లేవు. కేవలం తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితమైన ఈ మావిగన్ సిద్ధాంతాన్ని జనం మరిచిపోయేలా చేయడమే ఇప్పుడు వైసీపీ ముందున్న ఏకైక మార్గంలా కనిపిస్తోంది.
మావిగన్ దెబ్బకు తలబొప్పి కట్టిందా?
అమరావతిని దెబ్బకొట్టాలని తీసిన మావిగన్ అస్త్రం తిరగబడి సొంత పార్టీకే తగిలింది. రాజకీయంగా మైలేజ్ వస్తుందని ఆశించిన ఈ కాన్సెప్ట్ కాస్తా, ఇప్పుడు కేవలం మీమ్స్‌కు మాత్రమే పరిమితం కావడంతో వైసీపీ నేతలు ఇప్పుడు గన్ తీసి పక్కన పెట్టి, మళ్ళీ పాత సంక్షేమ రాగాన్నే అందుకోవాలని చూస్తున్నారు.


