హరీష్ రావు తాను అమెరికా వెళ్తున్నట్లుగా ప్రకటించారు. కొన్నాళ్లు అక్కడే ఉంటానని కూడా సోషల్ మీడియాలో తెలిపారు. ఎన్నాళ్లన్నది చెప్పలేదు. ప్రస్తుతం బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలతో సహజంగానే హరీష్ రావు అమెరికా పర్యటన బీఆర్ఎస్లో అంతర్గతంగా కలకలం రేపుతోంది. గతంలో కవిత కూడా అలా అమెరికా పోయినప్పుడు ఇక్కడ చాలా జరిగాయి. ఆమె వచ్చే సరికి.. ఆమెకు, పార్టీకి మధ్య పూడ్చలేనంత గ్యాప్ వచ్చింది. చివరికి అది సొంత పార్టీ ప్రకటనకు దారి తీసింది.
బండి భగీరథ్ కేసును పట్టించుకోని హరీష్
గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ వర్గానికి, హరీష్ రావు వర్గానికి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందనే వార్తలు వెబ్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పార్టీ పగ్గాల విషయంలో గానీ, భవిష్యత్తు కార్యాచరణలో గానీ హరీష్ రావును పక్కన పెడుతున్నారనే అసంతృప్తి ఆయన అనుచరుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. హరీష్ రావు రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. బండి సంజయ్ కుమారుడి కేసును బీఆర్ఎస్ సీరియస్ గా రాజకీయం చేస్తే హరీష్ రావు మాత్రం ఏమీ మాట్లాడలేదు. సరిగ్గా ఇటువంటి కీలక సమయంలో హరీష్ రావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండి అమెరికా వెళ్లడం, ఆయన మౌన ముద్ర వేయబోతున్నారా? లేక పార్టీ వ్యవహారాల నుంచి కొద్దిరోజులు విరామం కోరుకుంటున్నారా? అన్న సందేహాలు పార్టీ క్యాడర్‌కు వస్తున్నాయి.
పార్టీ అంతర్గత వ్యవహారాలపై సంతృప్తిగా లేని హరీష్ ?
హరీష్ రావు పార్టీలో అంత కంఫర్టబుల్ గా లేరని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఇటీవలి పరిణామాలు అందుకు సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. కుమారుడి చదువు అనేది వ్యక్తిగత విషయమైనప్పటికీ, రాజకీయాల్లో టైమింగ్ ముఖ్యం కాబట్టి, ఆయన పర్యటన వెనుక రాజకీయ వ్యూహం కూడా ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన కొంత అసంతృప్తితో ఉన్నారని, అందుకే ఈ విదేశీ పర్యటనను ఒక సాకుగా తీసుకున్నారని ప్రత్యర్థి వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.
బీఆర్ఎస్లో క్రమంగా మారుతున్న పరిస్థితులు
హరీష్ రావు లేని సమయంలో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికీ పార్టీ గాడిన పడకపోవడం, పార్టీ పునర్నిర్మాణం వంటి సవాళ్లతో సతమతమవుతున్న బీఆర్ఎస్ నాయకత్వానికి, హరీష్ రావు గైర్హాజరీ ఒక లోటుగానే కనిపిస్తోంది. ఆయన అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత పార్టీలో తన పాత్రపై ఎలాంటి స్పష్టత ఇస్తారో వేచి చూడాలి. ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటన మాత్రం బీఆర్ఎస్ లో ఏదో జరుగుతోందన్న గాసిప్స్ కు మరింత ఆజ్యం పోసింది
