కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 102 సీట్ల భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించినప్పటికీ, ముఖ్యమంత్రి ఎంపిక వ్యవహారం కాంగ్రెస్ అసలు నైజాన్ని మరోసారి బయటపెట్టింది. క్షేత్రస్థాయిలో పార్టీని నడిపించి విజయం వైపు నడిపించిన వీ.డీ. సతీశన్ వంటి నేతలను కాదని, రాహుల్ గాంధీ తన అత్యంత సన్నిహితుడు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని నిర్ణయించడం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. దశాబ్ద కాలం పాటు కేరళ రాజకీయాలకు దూరంగా ఉండి, కేవలం ఢిల్లీ కోటరీలో చక్రం తిప్పిన నేతకు పట్టం కట్టడం ద్వారా హైకమాండ్ మరోసారి గ్రౌండ్ లెవల్ నేతల మనోభావాలను తుంగలో తొక్కిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గ్రౌండ్ లెవల్లో పని చేసే నేతల్ని జైరాం రమేష్ వంటి వారు జడ్జ్ చేస్తారా?
రాహుల్ గాంధీ చుట్టూ ఉండే కోటరీ ప్రజామోదం ఉన్న నేతల భవిష్యత్తును శాసిస్తుండటం కాంగ్రెస్లో పాత రోగమే. జైరాం రమేష్ లాంటి నేతలకు సొంతంగా పోటీ చేసి గెలిచే నియోజకవర్గం కూడా లేకపోయినా, వారే పార్టీ వ్యూహాలను, రాష్ట్రాల నాయకత్వాలను నిర్ణయించడంపై ఆశ్చర్యమే. వేణుగోపాల్ కేవలం రాహుల్ వద్ద ఉన్న పలుకుబడిని ఉపయోగించుకుని, ఇతర నేతలు కష్టపడి తెచ్చిన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటున్నారని, ఇది పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అడుగంటిపోయిందని నిరూపిస్తోందని చెప్పాల్సిన పని లేదు.
కేరళలో కాంగ్రెస్ కోసం పని చేసిందెవరో తెలియదా?
కేరళలో కాంగ్రెస్ గెలిచిన వారం రోజులైనా నేటికీ అధికారికంగా ముఖ్యమంత్రి పేరును ప్రకటించలేకపోవడం ఆ పార్టీలోని గ్రూపు తగాదాలకు నిదర్శనం. ఒకవైపు సతీశన్ మద్దతుదారులు రోడ్లెక్కి నిరసనలు తెలుపుతుంటే, మరోవైపు ఢిల్లీ వేదికగా పదవుల పంపకం జరగడం విడ్డూరం. క్షేత్రస్థాయిలో కష్టపడే నేతలకు గుర్తింపు లేని చోట, కేవలం బ్రోకరీ చేసే వారికే పదవులు దక్కుతుంటే.. భవిష్యత్తులో నిజమైన నేతలు ఇతర పార్టీల వైపు చూసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దశాబ్ద కాలం తర్వాత వచ్చిన ఈ అధికారాన్ని ఇలాంటి వివాదాలతో చేజేతులా పాడు చేసుకుంటున్నారని అనుకుంటే వింత లేదు.
ఊడిగం చేసే వారికి పదవులిస్తే కష్టపడేవారికి ఎలా ఉంటుంది?
కాంగ్రెస్ పార్టీలో పుంజుకోవాలనే తపన కంటే తమకు ఊడిగం చేసే వారికి ప్రాధాన్యత ఇవ్వాలనే ధోరణి ఇంకా మారలేదు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనపడటానికి ప్రధాన కారణమైన ఈ కోటరీ రాజకీయాలు ఇప్పుడు కేరళలో కూడా పునరావృతం అవుతున్నాయి. రాహుల్ గాంధీ తన చుట్టూ ఉన్న ఆత్మీయుల కంటే, ప్రజల్లో ఆమోదం ఉన్న నేతలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే.. వచ్చిన ఈ అద్భుత విజయం కూడా కేవలం అల్పకాలిక ఆనందంగానే మిగిలిపోయే అవకాశం ఉంది.