వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నెల రోజుల విరామ ప్రయాణం ముగిసింది. మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్‌లో అడుగుపెట్టారు. ఆయన లేని ఈ నెల రోజులు ఏపీ రాజకీయాల్లో ఏదో వెలితిగా ఉందన్నది నిజం. కాకపోతే ఆ వెలితి వైసీపీ క్యాడర్‌కు కాదు.. టీడీపీ సోషల్ మీడియా విభాగానికి. జగన్ ఎప్పుడెప్పుడు మైకు ముందుకు వస్తారా, ఎప్పుడెప్పుడు ఆ మావిగన్ లాంటి కొత్త పదజాలంతో వినోదం పంచుతారా అని పసుపు దళం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది.
జగన్ ప్రెస్ మీట్లు ఇప్పుడు ఒక పొలిటికల్ కామెడీ క్లబ్ లా మారిపోయాయని సోషల్ మీడియా టాక్. ఆయన సీరియస్‌గా ప్రజల కష్టాల గురించి చెబుతుంటే, నెటిజన్లు మాత్రం ఆయన వాడే వింత పదాల కోసం, ఆ విరక్తి కలిగించే మేనరిజమ్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. మొన్నామధ్య ఆయన ప్రవేశపెట్టిన మావిగన్ అనే వింత కాన్సెప్ట్ మీద ఇప్పటికీ ట్రోల్స్ ఆగలేదు. ఆయన ప్రెస్ మీట్ పెడితే చాలు, గంట లోపే మీమ్స్ క్రియేటర్లకు నెల రోజులకు సరిపడా కంటెంట్ దొరికేస్తుంది. వైసీపీ వాళ్ళు ఆయన మాటలను డిఫెండ్ చేసుకోలేక తలలు పట్టుకుంటుంటే, టీడీపీ వాళ్ళు మాత్రం వాటిని వైరల్ చేస్తూ పండుగ చేసుకుంటున్నారు.
గత రెండేళ్లుగా జగన్ ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు వెళ్తున్నారో ఎవరికీ పట్టడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన వెళ్తే ఒక హడావుడి ఉండేది, ఇప్పుడు మాజీ అయ్యాక ఆ హడావుడి అంతా కేవలం ఆయన ప్రెస్ మీట్లలోని స్టఫ్ మీదనే ఉంది. ముఖ్యంగా అసెంబ్లీకి వెళ్లడం మానేసి, కేవలం తాడేపల్లి గడప దాటకుండా మీడియా ముందు కూర్చుని పాత చింతకాయ పచ్చడి లాంటి విమర్శలు చేస్తుంటే.. చూసేవాళ్లకు రాజకీయ విశ్లేషణ కంటే ఓ రీల్స్ ఎపిసోడ్ చూసినట్లే ఉంటోంది.
ప్రస్తుతం తాడేపల్లిలో ఆయన అడుగుపెట్టారన్న వార్త తెలియగానే, సోషల్ మీడియాలో బెట్టింగ్‌లు మొదలయ్యాయి. ఈసారి కొత్తగా ఏ పదం వదులుతారు అమరావతి మీద ఇంకెన్ని శాపనార్థాలు పెడతారు అంటూ సెటైర్లు పేలుతున్నాయి. వైసీపీ నేతలు మా నాయకుడు వచ్చాడు.. ఇక యుద్ధమే అని బిల్డప్ ఇస్తుంటే, టీడీపీ సోషల్ మీడియా మాత్రం తొందరగా ప్రెస్ మీట్ పెట్టండి సార్.. మాకు మీమ్స్ కరువయ్యాయి అంటూ ఆహ్వానం పలుకుతోంది. విచిత్రం ఏమిటంటే, సొంత పార్టీ వాళ్ల కంటే ప్రత్యర్థి పార్టీ వాళ్లే ఆయన రాక కోసం ఇంత ఆతృతగా ఎదురుచూడటం నిజంగా ఏపీ రాజకీయాల్లోనే ఒక వింత అనుకోవచ్చు. అదే జగన్ ప్రత్యేకత.