వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ కు సుప్రీంకోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ రద్దు అయింది. సాక్షులను బెదిరించడం, దర్యాప్తును ప్రభావితం చేయడం వంటి చర్యల ద్వారా వ్యవస్థను మేనేజ్ చేయాలనుకున్న ఆయన ప్రయత్నాలు విఫలమవ్వడమే కాకుండా, తిరిగి కటకటాల వెనక్కి నెట్టాయి. ఇప్పటికే ఆయన సాక్షులను బెదిరించిన కేసులో జైల్లో ఉన్నారు. ఆ కేసులో బెయిల్ వచ్చినా ప్రధాన కేసులో మాత్రం జైల్లోనే ుండనున్నారు.
తన వద్ద డ్రైవర్గా పనిచేసిన సుబ్రహ్మణ్యంను అత్యంత కిరాతకంగా హత్య చేసి, ఆపై ప్రమాదంగా చిత్రీకరించేందుకు అనంత బాబు ప్రయత్నించారు. యంగా నిందితుడే మృతదేహాన్ని బాధితుడి ఇంటికి తీసుకువెళ్లడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. తొలుత ఈ కేసులో అనంతబాబు తానే హత్య చేశానని అంగీకరించారు. అయితే ఒక్కడే చేయలేదని ఇంకా పలువురి పాత్ర ఉందని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.
మే 20 నుంచి ఈ కేసులో రెగ్యులర్ విచారణ ప్రారంభం కానుండటం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. విచారణ ప్రక్రియను వేగవంతం చేసి తీర్పు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సాక్ష్యాలు బలంగా ఉండటం , నిందితుడి ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో, అతి త్వరలోనే ఈ కేసులో తుది తీర్పు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉన్నందున, విచారణ పూర్తయ్యే వరకు ఆయనకు తిరిగి బెయిల్ లభించే అవకాశాలు దాదాపుగా లేనట్లే.
న్యాయ వ్యవస్థను గౌరవించకుండా, తన రాజకీయ పలుకుబడితో కేసు నుండి బయటపడాలని చూసిన అనంత బాబుకు కోర్టు తీర్పు ఒక గట్టి హెచ్చరికగా మారింది. ప్రాథమిక ఆధారాలు , నిందితుడి గతాన్ని పరిశీలిస్తే, కోర్టు ఆయనపై కనికరం చూపే అవకాశం లేదని స్పష్టమవుతోంది. విచారణ సజావుగా సాగి, నేరం నిరూపణ అయితే ఆయనకు జైలులోనే శిక్ష ఖరారు కావడం ఖాయమని బాధితుడి కుటుంబ సభ్యులు , న్యాయవాదులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
