రెంటల్ Vs పర్సంటేజీ విధానాలపై టాలీవుడ్ లో విస్క్రృతమైన చర్చే నడుస్తోంది. `పెద్ది` లాంటి పెద్ద సినిమా రిలీజ్ కు ముందు ఎగ్జిబీటర్లు పట్టుపట్టడంతో, ఈ వ్యవహారంలో ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఇంకాస్త బలంగా ఏర్పడింది. పర్సంటేజీ ఇవ్వకపోతే సింగిల్ స్క్రీన్లు నడపలేమని ఎగ్జిబీటర్లంతా తేల్చేశారు. పర్సంటేజీ ఇవ్వడానికి నిర్మాతలు ఒప్పుకొనే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే.. ఇప్పటికే నిర్మాతల ఆదాయ మార్గాలన్నీ మూసుకుపోతున్నాయి. ఇప్పుడు వచ్చిన ఆదాయంలో థియేటర్లకు వాటా ఇస్తే, నిర్మాతల మనుగడే ప్రశ్నార్థకం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
మరోవైపు ఎగ్జిబీటర్ల వాదనా కరెక్టే. సింగిల్ స్క్రీన్స్ ని నిర్వహించడం తలకు మించిన భారం అవుతోంది. నెలకు అద్దెల రూపంలో రూ.7 లక్షల వరకూ వస్తోంది. అదే గొడౌన్ కి ఇచ్చేస్తే రూ.15 లక్షలు ఇస్తారు. అంటే సినిమాల కోసం ఎనిమిది లక్షలు నష్టపోవాల్సివస్తోంది. పట్నంలో సింగిల్ స్క్రీన్ ఉంటే, ఆ ఆస్తి విలువ దాదాపుగా రూ.100 కోట్లు. దానిపై వడ్డీ చూసుకొన్నా రూ.7 లక్షల మొత్తం చాలా చాలా చిన్నది. అలాంటప్పుడు సింగిల్ స్క్రీన్ ఎవరి కోసం నెట్టుకురావాలి?
అయితే సింగిల్ స్క్రీన్ నిర్వహణపై చాలా ప్రశ్నలు ఉన్నాయి. అసలు థియేటర్లలో మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నారా? కనీసం టాయిలెట్లయినా సరిగా ఉంటున్నాయా? ఆ సౌండ్ సిస్టమ్స్ బాగు చేయించి ఎంత కాలం అయ్యింది? సిట్టింగ్ సిస్టమ్ ఇంకా రోతగా మారిపోయింది. మల్టీప్లెక్స్ వేరు. అక్కడి సదుపాయాలు వేరు. టెక్నాలజీ వేరు. ఎప్పటికప్పుడు ట్రెండ్ ని, టెక్నాలజీనీ ఫాలో అవుతూ థియేటర్లని అప్ డేట్ చేసుకొంటున్నాయి. ఇవన్నీ సింగిల్ స్క్రీన్స్ ఎప్పటికి అందిపుచ్చుకొంటాయి?
పర్సంటేజీ విధానం అమలు చేస్తే థియేటర్ల నిర్వహణ మెరుగు పరుస్తాం అంటున్నారు. అయితే కొన్ని థియేటర్లు మొత్తంగా శిధిలావస్థకు చేరుకొన్నాయి. మరి ఆ థియేటర్ల మాటేంటి?
ప్రభుత్వాలు టికెట్ రేట్లు పెంచినా, మేం మాత్రం పెంచబోం అని చెప్పడం ఎంత వరకూ న్యాయం? అలా అంటే.. నిర్మాత పరోక్షంగా నష్టపోతాడు కదా. పర్సంటేజీ విధానం అమలు చేసినా సరే.. ఈ విషయంలో ఎగ్జిబీటర్లు ఇంతే మొండిగా ఉంటారా? అప్పుడు ఇద్దరికీ నష్టమే కదా..?
పెద్ద సినిమాలకు పర్సంటేజీ విధానం అమలు చేయడం వల్ల ఎగ్జిబీటర్లు తప్పకుండా లాభపడతారు. మరి చిన్న సినిమాల పరిస్థితి ఏమిటి? షోకి పది టికెట్లు కూడా తెగకపోతే.. నిర్మాత ఎలాగూ నష్టపోతాడు. పర్సంటేజీ వల్ల ఇప్పుడు ఎగ్జిబీటర్ కూడా నష్టపోతాడు కదా. మరి ఈ రిస్కు తీసుకోవడానికి ఎగ్జిబీటర్లు సిద్ధమేనా?
ఇవన్నీ ఎగ్జిబీటర్లు ఆలోచించుకోవాల్సిన అంశాలు. నిర్మాతల్ని వేధిస్తున్న సందేహాలు. వీటికి సమాధానం కోసం అన్వేషించాల్సిన సమయం ఇది. ఇద్దరూ కూర్చుని ఓ నిర్ణయం తీసుకొంటే తప్ప పరిష్కారం దొరకదు. ఎవరెన్ని చేసినా, కిందా మీదా పడ్డా, ఒకరు నష్టపోయి మరొకరికి సాయం పట్టినా అంతిమంతా సినిమా బతకాలి. థియేటర్లకు దూరం అయిపోతున్న ప్రేక్షకుడ్ని మళ్లీ థియేటర్ వరకూ రప్పించాలి. అదే అందరి అంతిమ లక్ష్యం కావాలి.
