చాలా వారాలుగా బాక్సాఫీసుకు విజయాల్లేవు. థియేటర్ల దగ్గర సందడి లేదు. బయ్యర్ల కళ్లల్లో ఆనందం లేదు. ఇవన్నీ తిరిగి దక్కాలంటే ‘పెద్ది’ రావాల్సిందే అన్నది అందరి మాట. జూన్ 4న పెద్ది రిలీజ్ అవుతోంది. 3 నుంచే ప్రీమియర్లు మొదలైపోతాయి. ఈలోగా ప్రమోషన్లు కూడా మొదలెట్టారు. ఈవారంలోనే ‘పెద్ది’ ట్రైలర్ రాబోతోంది. ఎలా చూసినా ఈ నెల రోజులూ ‘పెద్ది’ టాపిక్కే నడుస్తుంది.
‘పెద్ది’కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాని ఇప్పటి వరకూ స్పోర్ట్స్ డ్రామానే ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నారు. అయితే అంతకు మించిన అంశాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఊరికి సంబంధించిన ఎమోషన్ ఈ కథలో బలంగా ఉండబోతోందని టాక్. ప్రభుత్వాలు, పాలకులూ నిర్లక్ష్యం చేసిన ఊరి కోసం హీరో ఏం చేశాడన్నది ఆసక్తికరంగా ఉండబోతోందని సమాచారం. కథకు సంబంధించిన కోర్ ఎలిమెంట్ ఇదే కావొచ్చు. కోచ్ గా శివరాజ్ కుమార్, హీరో తండ్రిగా జగపతిబాబు క్యారెక్టర్లని దర్శకుడు బుచ్చిబాబు చాలా స్ట్రాంగ్ గా డిజైన్ చేశాడని సమాచారం. ఆ రెండు క్యారెక్టర్లూ ఈ కథకు ఆయువు పట్టు అని తెలుస్తోంది. ఈ అంశాలన్నీ రాబోయే ట్రైలర్ లో మేళవించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ ‘పెద్ది’ కథేమిటన్నది లీక్ కాలేదు. ట్రైలర్ లో కథకు సంబంధించిన క్లూ చూచాయిగా ఇచ్చే అవకాశం ఉంది.
ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించి 2 పాటలు విడుదల అయ్యాయి. త్వరలో 3వ పాట రాబోతోంది. ఈసారి స్పెషల్ సాంగ్ ని దించబోతున్నార్ట. రెహమాన్ అందించిన ట్యూన్ అదిరిపోయిందని తెలుస్తోంది. గత రెండు పాటలూ చాట్ బస్టర్లు అయ్యాయి. వాటికి మించి ఈ పాట ఉంటుందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. శ్రుతిహాసన్ ఈ పాటలో చరణ్ తో ఆడిపాబోతున్న సంగతి తెలిసిందే.