కాస్త లేటయినా, సినిమా స్క్రిప్టుకి తగ్గని మలుపులతో తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేశాడు విజయ్. దాంతో విజయ్ ఫ్యాన్స్ రిలాక్సయిపోయారు. ఇప్పుడు తమిళ నాట మరో.. ఆసక్తికరమైన అంశం టాప్ గేర్ లోకి వచ్చింది. అదే.. త్రిష. విజయ్ సర్కారులో త్రిష పాత్ర ఏమిటి? ఆమెకు విజయ్ ఇచ్చే ప్రాధాన్యత ఏమిటి? అనేది తమిళనాట హాట్ టాపిక్.
విజయ్ – త్రిషల మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. వాళ్లిద్దరి మధ్య ఏం నడుస్తుందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. విజయ్ అతి త్వరలోనే త్రిషని పెళ్లాడతారన్న వార్త.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అంతకంటే ముందు ఆమెకు డిప్యూటీ సీఎం పదవీ కట్టబెడతారని ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. త్రిష రాజకీయాల్లోకి రావడం పెద్ద విచిత్రమేం కాదు. ఎందుకంటే తనకు పాలిటిక్స్ పై కాస్త ఆసక్తి ఉంది. నిలబడితే.. గెలిచేంత క్రేజ్ కూడా ఉంది. పైగా విజయ్ గెలిచిన తిరుచ్చి స్థానాన్ని ఇప్పుడు వదులుకోబోతున్నాడు. అక్కడ త్రిషని నిలబెడితే గెలుపు మంచినీళ్ల ప్రాయం. ఆ తరవాత… మంత్రిగా ప్రమాణ స్వీకారం. ఇదీ ప్రస్తుతం విజయ్ ముందున్న రాజమార్గం.
అదే జరిగితే… ప్రతిపక్షాలకు, విమర్శకులకు విజయ్ ఓ ఆయుధాన్ని ఇచ్చినట్టు అవుతుంది. వాళ్ల విమర్శల్ని, సూటి పోటి మాటల్ని విజయ్, త్రిషలు ఎలా ఎదుర్కొంటారన్నది ఇక్కడ కీలకం. గెలిచిన వెంటనే, తన సొంత వాళ్లపై విజయ్ ఇలా ప్రేమ ఒలకబోసి, ఏకంగా మంత్రిని చేసేస్తే ప్రజల్లోనూ కొంత నెగిటీవ్ రియాక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే కొన్నాళ్లు త్రిష విషయంలో విజయ్ సైలెంట్ గానే ఉంటారని అనిపిస్తుంది. కానీ విజయ్ కాస్త మొండి ఘటం టైపు. ఎవరేం అనుకొన్నా పెద్దగా పట్టించుకొనే రకం కాదు. ఎన్నికల ముందు త్రిషని వెంటేసుకొని, శుభకార్యాలకు కూడా హాజరయ్యారు. కాబట్టి వాళ్ల బంధం ఏమిటన్న విషయంలో విజయ్ కి దాగుడు మూతలు ఆడడం ఇష్టం లేదని క్లారిటీ వచ్చేసింది. త్రిషని ఇప్పుడు శాసన సభలో కూర్చోబెట్టకపోతే, మంత్రి పదవి ఇవ్వకపోతే.. మళ్లీ ఈ ఆవకాశం వస్తుందో రాదో అనే అనుమానమూ ఉండొచ్చు. ఎం.ఎల్.ఏ సీటు ఇవ్వకుండా, పార్టీలో కీలకమైన బాధ్యతలు అప్పగించే ఆలోచన కూడా ఉంది. అయితే త్రిష మాత్రం విజయ్ తో పాటుగా శాసనసభలో అడుగుపెట్టాలని గట్టిగా డిసైడ్ అయిపోయిందని, అందుకే విజయ్ ముందు కూడా ఇది మినహాయిస్తే మరో మార్గం లేదని అక్కడి రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. విమర్శలు ఎన్నొచ్చినా, పట్టించుకోకూడదు అనుకొంటే త్రిషని ఎం.ఎల్.ఏ చేయడం ఖాయం. కానీ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయం ఉంటే మాత్రం విజయ్ బ్యాక్ స్టెప్ వేయొచ్చు.
