మెడికల్ సీట్ల కోసం నిర్వహించిన నీట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసింది. మే 3, 2026న నిర్వహించిన ఈ పరీక్షలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రాజస్థాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ జరిపిన విచారణలో, పరీక్షకు ముందే సోషల్ మీడియాలో చలామణి అయిన గెస్ పేపర్ లోని సుమారు 140 ప్రశ్నలు అసలు ప్రశ్నపత్రంతో సరిపోలాయని వెల్లడైంది. ఈ అక్రమాల స్థాయిని బట్టి చూస్తే 720 మార్కులకు గాను 600 మార్కుల విలువైన ప్రశ్నలు ముందే లీక్ అయ్యాయి.
ఈ కుంభకోణం వెనుక అంతర్రాష్ట్ర ముఠాల హస్తం ఉందన్న అనుమానంతో కేంద్ర ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగించింది.ఇప్పటికే ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్, రాజస్థాన్‌లోని సికార్ , ఝున్ఝును ప్రాంతాల నుండి 13 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రశ్నపత్రాలను ఒక్కో విద్యార్థికి 5 లక్షల వరకు విక్రయించినట్లు, పరీక్షకు ముందు రోజు వీటిని రూ. 30,000 కు కూడా అమ్మారని విచారణలో తేలింది. కేరళలోని ఒక మెడికల్ కాలేజీలో చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థి ఈ లీక్ వెనుక కీలక సూత్రధారిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
పరీక్ష రద్దు కావడంతో దేశవ్యాప్తంగా దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కొత్త పరీక్ష నిర్వహణకు సంబంధించిన తేదీలను ఎన్టీఏ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. అయితే, నిరంతరం జరుగుతున్న ఈ లీకుల పరంపరతో మళ్లీ పరీక్ష పెట్టినా అది పారదర్శకతతో సాగుతుందా అన్నది విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రధాన ప్రశ్నగా మారింది. 2024లో జరిగిన నీట్ వివాదం తర్వాత ప్రభుత్వం తీసుకున్న జీరో టాలరెన్స్ చర్యలు, కొత్త చట్టాలు ఉన్నప్పటికీ మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది.
పరీక్షా పత్రాల రక్షణ కోసం ఎన్టీఏ జీపీఎస్ ట్రాకింగ్ వాహనాలు, ఏఐ ఆధారిత సీసీటీవీ నిఘా, బయోమెట్రిక్ వెరిఫికేషన్, 5G సిగ్నల్ జామర్లను వాడినట్లు చెబుతున్నా, సాంకేతికతను మించి అక్రమాలు జరుగుతున్నారు. కొత్తగా నిర్వహించే పరీక్షలో మరింత పటిష్టమైన భద్రతతో పాటు, ప్రశ్నపత్రాల పంపిణీ విధానంలో సమూల మార్పులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే అహర్నిశలు శ్రమించి చదివే ప్రతిభావంతులైన విద్యార్థులకు అన్యాయం జరుగుతూనే ఉంటుంది.
