తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్, తన తొలి అడుగులోనే సంచలన నిర్ణయంతో ప్రజల దృష్టిని ఆకర్షించారు. పాఠశాలలు, ప్రార్థనా మందిరాలు, బస్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న 717 మద్యం దుకాణాలను తక్షణమే మూసివేయాలని ఆదేశించారు. కొత్త ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం సామాన్య ప్రజల నుంచి, ముఖ్యంగా మహిళల నుంచి పెద్దఎత్తున ప్రశంసలు అందుకుంటోంది. అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా స్పందించడం విజయ్ నాయకత్వానికి మంచి ఎలివేషన్‌ను ఇచ్చింది.
అయితే, ఇలాంటి ఆరంభ శూరత్వం కొత్తలో సహజమేనని, దీన్ని సుదీర్ఘకాలం అమలు చేయడంలోనే అసలైన నాయకత్వ పటిమ దాగి ఉందన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. గతంలో అనేక ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, అవి కేవలం కాగితాలకే పరిమితమైన సందర్భాలు ఉన్నాయి. ఒక ప్రాంతంలో దుకాణాన్ని మూసివేసి, ప్రజల నిరసనలు తగ్గాక మరో వీధిలోకి తరలించే స్థానచలనం రాజకీయాలు జరిగితే ఈ నిర్ణయానికి అర్థమే ఉండదు. విజయ్ ప్రభుత్వం ఈ విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందా లేక ఇది కేవలం ప్రాథమిక ప్రచార ఆర్భాటమేనా అనేది వేచి చూడాలి.
విజయ్ తన ఎన్నికల మేనిఫెస్టోలో దశలవారీ మద్యనిషేధాన్ని ప్రధాన హామీగా పేర్కొన్నారు. తమిళనాడు ప్రభుత్వానికి మద్యం విక్రయాల ద్వారా ఏడాదికి దాదాపు రూ. 48,000 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఇంతటి భారీ ఆదాయ వనరును వదులుకుని, రాష్ట్రాన్ని మద్యరహితంగా మార్చడం విజయ్ ముందున్న అతిపెద్ద సవాలు. 717 దుకాణాల మూసివేత అనేది ఆ లక్ష్యం దిశగా కేవలం ఒక చిన్న అడుగు మాత్రమే. సంక్షేమ పథకాలకు నిధుల కొరత రాకుండా చూసుకుంటూనే, మద్యపానాన్ని నియంత్రించడం అంటే కత్తి మీద సాము వంటిదే.
ఏ రాజకీయ నాయకుడికైనా ఆరంభంలో వచ్చే చప్పట్లు శాశ్వతం కావు. విజయ్ ప్రకటించిన మద్య నియంత్రణ హామీ క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు కావాలంటే, మూతపడ్డ దుకాణాలు మళ్లీ వెలవకుండా గట్టి నిఘా ఉంచాలి. అలాగే, దశలవారీగా మిగిలిన దుకాణాలను కూడా తొలగిస్తూ వెళ్లాలి. సినిమా తెరపై కనిపించే హీరోయిజం వేరు, పాలనలో చూపించే నాయకత్వం వేరు. విజయ్ మార్పు చూపిస్తారా?
