ఈమధ్య సోషల్ మీడియా ధాటికి సెలబ్రెటీలు బెంబేలెత్తిపోతున్నారు. చిన్న చిన్న విషయాలకే మనోభావాలు దెబ్బతింటున్నాయి. రియాక్షన్లు గట్టిగా ఇస్తున్నారు. దాంతో ఎవరైనా సరే, ఆచి తూచి అడుగులేయాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా సున్నితమైన విషయాలపై తక్షణం రియాక్ట్ అవుతున్నారు. హాస్య నటుడు అలీ విషయంలో ఇప్పుడు ఇదే జరిగింది.
ఇటీవల అలీ ఓ సబ్బుకి సంబంధించిన యాడ్ చేశారు. ఆ యాడ్ లో.. సబ్బుకి లక్ష్మీపూజ చేస్తున్నట్టు కనిపించింది. బ్యాక్ గ్రౌండ్ లో కొన్ని మంత్రాలు వినిపించాయి. దాంతో హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఓ వాణిజ్య ప్రకటన కోసం మత విశ్వాసాల్ని అసహాస్యం చేయడం భావ్యం కాదని, దీనిపై అలీ స్పందించాలని, క్షమాపణ చెప్పాలని, సినిమాల నుంచి కూడా అలీని బాయ్ కాట్ చేయాలంటూ డిమాండ్లు వినిపించాయి.
దాంతో అలీ దిగిరాక తప్పలేదు. ఈ వ్యవహారంపై అలీ ఓ వీడియో విడుదల చేశారు. ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించాలని కోరారు. ఆ వీడియో కూడా డిలీట్ చేశానన్నారు. ముంబై కంపెనీ వాళ్లు యాడ్ చేయమన్నారని, దేవుడు చేసిన మనుషులు సినిమాలో తనపై కంపోజ్ చేసిన ఓ బిట్ ని ఈ యాడ్ కోసం వాడామని, అయితే తన సన్నిహితులంతా యాడ్ ఇబ్బందిగా ఉందని చెప్పడంతో డిలీట్ చేశానని అలీ చెప్పుకొచ్చారు. దీంతో ఓ వివాదానికి ఆయన స్వయంగా పుల్ స్టాప్ పెట్టినట్టైంది.
క్రియేటివిటీకి హద్దులు ఉండవు కానీ, కొన్నిసార్లు హద్దుల్లో ఉంటేనే మంచిది. లేదంటే… ఇలా ఇబ్బందుల పాలు కావాల్సివస్తుంది. ఇక మీదట ఇలాంటి ప్రయత్నాలు, ప్రయోగాలు చేసినప్పుడు మరింత అప్రమత్తంగా ఉండడం అవసరం.
