అమ్మ సెంటిమెంట్ వెండితెరపై ఎవర్గ్రీన్ ఫార్ములా. మాతృదేవోభవ నుంచి కేజీఎఫ్ వరకు బోలెడు సూపర్ హిట్ సినిమాలు అమ్మ చుట్టూనే తిరిగాయి. ముంజుమల్ బాయ్స్ లాంటి విజయాన్ని అందించిన దర్శకుడు చిదంబరం తాజాగా తల్లి-కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఓ సినిమా తీసుకొచ్చాడు. కాకపోతే దీనిని సర్వైవల్ థ్రిల్లర్‌గా మలిచాడు. అదే ‘బాలన్: ది బాయ్’. మరి ఇందులోని భావోద్వేగాలు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులని ఎంతలా ఆకట్టుకున్నాయి? మదర్ సెంటిమెంట్ జోడించిన సర్వైవల్ థ్రిల్లర్ డ్రామా ఎంతలా పండింది?
జైలు నుంచి బయటికి వచ్చిన తల్లి (ఫర్జానా) తన ఆరేళ్ల కొడుకు (ఆదిశేషన్)తో కలిసి గుర్తింపులు మార్చుకుంటూ జీవించాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రతి ఊర్లో కొత్త పేర్లు, కొత్త కథలతో బ్రతుకుతుంటారు. ఇలాంటి ఒకానొక సమయంలో ఆ తల్లి జాడ లేకుండా పోతుంది. తల్లి కోసం ఎదురుచూసిన పిల్లాడు పోలీస్ స్టేషన్‌కి చేరుతాడు. ఆ తర్వాత ఈ కథ ఎలాంటి మలుపులు తిరిగింది? ఆ ఇద్దరూ ఎందుకు తమ గుర్తింపులు మార్చుకుంటూ తిరుగుతున్నారు? చివరికి ఆ పిల్లాడు తన తల్లిని చేరుకున్నాడా లేదా? అనేది మిగిలిన కథ.
మలయాళ సినిమా కథకుల రచనా శైలి చాలా ప్రత్యేకం. వాళ్లు ఎంచుకునే కథల్లోనే కాదు, వాటి నేపథ్యాల్లో కూడా ఎప్పుడూ ఒక కొత్తదనం కనిపిస్తుంది. అదే సమయంలో సన్నివేశాల అల్లిక కూడా చాలా సహజంగా, నిజాయితీగా ఉంటుంది. ఒక కథ అనుకున్నాక దానికి పూర్తిగా కట్టుబడి ఉండి, దాన్ని తెరపై ఆవిష్కరించే విధానంలో కూడా సహజత్వం స్పష్టంగా కనిపిస్తుంది. ‘రోమాంచం’, ‘ఆవేశం’ వంటి విభిన్నమైన కథలు రాసిన జీతూ మాధవన్, ‘బాలన్: ది బాయ్’ కథను కూడా అలాంటి కొత్త కోణంతో రాసుకున్నాడు.
ఒక తల్లి తన ఆరేళ్ల కొడుకుతో కలిసి చేసే ప్రయాణం ఈ సినిమా తొలి సగం. వాళ్లు ఎక్కడికి వెళ్లినా తమ పేర్లు, చిరునామాలు మార్చుకుంటూ ఉంటారు. తమ గతం గురించి ఎవరికీ చెప్పుకోరు. ఎవరైనా కాస్త దగ్గరైనట్లు అనిపించినా వెంటనే ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లిపోతుంటారు. ఇలా సాగుతున్న వారి జీవితంలో ఒక వృద్ధురాలు ప్రవేశిస్తుంది. ఆమె దగ్గర ఆశ్రయం పొందిన తర్వాత కథలో ఒక కీలక మలుపు వస్తుంది. అదే ఈ చిత్రానికి చాలా మంచి విరామ ఘట్టంగా నిలుస్తుంది.
ఇంటర్వెల్ వరకు సినిమా నెమ్మదిగా సాగినా, అసలు ఈ తల్లి-కొడుకులు ఎవరు? ఎందుకు ఇలా జీవిస్తున్నారు? అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగించడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. కాకపోతే రెండో భాగంలో కథ మిస్సింగ్ డ్రామాగా మరో దిశలో ప్రయాణిస్తుంది. అబ్బాస్ పాత్రలో ప్రవేశించిన టోవినో థామస్ పాత్రకు ఒక బ్యాక్‌స్టోరీ ఇచ్చి కొన్ని సన్నివేశాలు నడిపారు. అయితే అవి తల్లి-కొడుకుల ఎమోషన్‌కి కాస్త దూరంగా కథను వేరే మార్గంలో తీసుకెళ్లిన భావన కలిగిస్తాయి. అయితే ఈ సినిమాకి దర్శకుడు ఇచ్చుకున్న క్లైమాక్స్ మాత్రం గుర్తుండిపోతుంది. కథలోని ప్రతి పాత్రను వివరంగా ఉపయోగించుకున్న తీరు రచనలోని నైపుణ్యానికి అద్దం పడుతుంది.
మంచి ప్రారంభం, ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విరామ ఘట్టం, అలాగే ఊహించని మలుపులతో కూడిన ముగింపు… ఇవన్నీ ఒక మంచి కథకు ఉండాల్సిన లక్షణాలు. ఆ లక్షణాలు ఈ సినిమాలో ఉన్నాయి. అయితే చాలా మలయాళ సినిమాల్లో కనిపించే సాధారణ సమస్యే దీనికీ ఉంది. సన్నివేశాలు, పాత్రల ప్రయాణం చాలా నెమ్మదిగా సాగుతాయి. కొన్ని హై మూమెంట్స్ ఉన్నప్పటికీ, ఈ స్లో రిథమ్‌ను భరించగలిగే ప్రేక్షకులైతే మాత్రమే వాటిని పూర్తిగా ఆస్వాదించగలరు.
సినిమాకు ప్రధాన బలం తల్లి, కొడుకు పాత్రలే. వారి ప్రేమ, పోరాటం ప్రేక్షకులను కథలో భాగం చేస్తాయి. ముఖ్యంగా తల్లి పాత్రలో చేసిన ఫర్జానా గుర్తుండిపోతుంది. ఆమె ఏం ఆలోచిస్తుందో ఆడియన్స్ గెస్ చేయడం కష్టమే. తన బ్యాక్‌స్టోరీ చాలా పోయెటిక్‌గా ఉంటుంది. బామ్మకి చెప్పిన “రాజు, రాణి, బానిస” కథలోనే తన గతం అంతా ఉంటుంది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఆడియన్స్‌కే వదిలేశారు. పిల్లాడిగా చేసిన ఆదిశేషన్ అమాయకమైన చూపు, తల్లి జాడ కోసం పడే ఆరాటం ఎమోషనల్‌గా ఉంటాయి. టోవినో థామస్ బయటికి కాస్త గ్రే షేడ్‌లో కనిపించినా, తన పాత్రలో కూడా చివరికి మానవత్వాన్ని చూపించారు. పోలీస్ ఆఫీసర్ పవిత్రన్ పాత్ర సెకండ్ హాఫ్‌కి కీలకం. తన ప్రేమని దూరం చేశారని పగ పట్టిన ఆ పాత్ర మానవ నైజంలో క్రూరత్వాన్ని చూపిస్తుంది. షైజు ఖాలిద్ సినిమాటోగ్రఫీ, సుశిన్ శ్యామ్ నేపథ్య సంగీతం కథకు తగ్గట్టుగా చక్కగా కుదిరాయి.
నిజానికి ఈ సినిమా తెలుగు ట్రైలర్‌పై చాలా కామెంట్స్ వచ్చాయి. కానీ సినిమాలో మాత్రం డబ్బింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కాకపోతే తెలుగు టైటిల్స్ విషయంలో బాధ్యతారాహిత్యం కనిపిస్తుంది. ఇంటర్వెల్‌ని “మధ్యంతరం” అని వేశారు. అలాగే క్రెడిట్స్‌లో కూడా తెలుగు భాషని కించపరిచే గూగుల్ ట్రాన్స్‌లేషన్స్ ఉన్నాయి. టైటిల్స్ అనువాదం చేస్తున్నప్పుడు కనీసం తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కి పాటలు రాసే ఒక రచయితని కూర్చోబెట్టి ఒకసారి క్రాస్ చెక్ చేస్తే సరిపోతుంది. ఈ మాత్రం కూడా శ్రద్ధ తీసుకోకపోవడం నిర్లక్ష్యమే.
సాధారణంగా తల్లి-కొడుకుల కథకు సర్వైవల్ థ్రిల్లర్ టచ్ ఇవ్వడం, ఆ కథను దర్శకుడు చిదంబరం తెరపై ఆవిష్కరించిన తీరు కొత్తగా అనిపిస్తుంది. కాకపోతే ఇది ప్రేక్షకులను పూర్తిగా మైమరపించే గొప్ప థియేట్రికల్ అనుభవాన్ని ఇచ్చే సినిమా అని చెప్పలేం. కానీ కథ నిర్మాణంలో రచయిత, దర్శకుడు చూపించిన నవ్యత, పాత్రలను వాటి చుట్టూ ఉండే సన్నివేశాలతో అల్లుకున్న తీరు మాత్రం ఒక మంచి నవలను వెండితెరపై చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది.
