తమిళ రాజకీయాలంటేనే భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, పాలాభిషేకాలు. కానీ, వీటన్నింటికీ విజయ్ చెక్ పెట్టారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరూ బ్యానర్లు, కటౌట్లు పెట్టవద్దని, అలా చేస్తే పార్టీ నుంచి బహిష్కరిస్తానని ఆయన హెచ్చరించడం సంచలనం రేపింది. విజయ్ దృష్టి అంతా ఇప్పుడు డిజిటల్ ఎకో సిస్టమ్ మీదనే ఉంది. తన పార్టీ కేడర్ అంతా సోషల్ మీడియా వేదికగానే ప్రభుత్వానికి ప్రచారం చేయాలని, పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన ఆదేశించారు.
డిజిటల్ ఎకో సిస్టమ్ – విజయ్ బలమైన ఆయుధం
గత కొన్నేళ్లుగా విజయ్ తన సినిమాల ప్రచారం కోసం ఒక అజేయమైన డిజిటల్ నెట్‌వర్క్‌ను నిర్మించుకున్నారు. ఇప్పుడు అదే నెట్‌వర్క్‌ను రాజకీయాలకు మళ్లించారు. విజయ్ అనుసరిస్తున్న డిజిటల్ ఫస్ట్ స్ట్రాటజీ పట్టణ ప్రాంతాల్లోని యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సంప్రదాయ పార్టీలు ఇంకా వీధుల్లో మైకులు పట్టుకుని తిరుగుతుంటే, విజయ్ టీమ్ మాత్రం నెటిజన్ల ఫోన్లలోకి నేరుగా చేరుకుంటోంది. సామాన్యులే నేతలుగా ఎదిగేలా ఈ ఎకో సిస్టమ్ సహకరిస్తోంది, ఇది ఇతర పార్టీలకు భిన్నమైన ఇమేజ్ను తెచ్చిపెడుతోంది. అది ఎన్నికల ఫలితాల్లో నిరూపితమయింది.
రివర్స్ అయితే ప్రమాదమే!
అయితే, ఈ డిజిటల్ ప్రచారం అనేది రెండు వైపులా పదునున్న కత్తి వంటిదని అనుకోవచ్చు. ఏదైనా ఒక అంశంపై నెటిజన్లకు ‘వెగటు’ పుడితే, అదే సోషల్ మీడియా ఆ పార్టీని దారుణంగా ట్రోల్ చేస్తుంది. విజయ్ ప్రస్తుతం సానుకూల పవనాల మీద ఉన్నారు కాబట్టి ఈ వ్యూహం ఫలిస్తోంది. కానీ, ఒకసారి ప్రజల్లో ప్రతికూల భావన మొదలైతే, డిజిటల్ మాధ్యమాల్లో దానిని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు. ఒక చిన్న పొరపాటు జరిగినా అది క్షణాల్లో వైరల్ అయి, పార్టీ ప్రతిష్టను తలకిందులు చేసే అవకాశం ఉంది.
వర్చువల్ వర్సెస్ రియాలిటీ
రాజకీయాల్లో డిజిటల్ ప్రచారం ముఖ్యం కావొచ్చు కానీ, అది కేవలం ఒక పరికరం మాత్రమే. తమిళనాడులోని కుగ్రామాల్లో ఉండే ఓటర్లకు ఇప్పటికీ నాయకుడు ప్రత్యక్షంగా కనపడాలి, వారితో మాట్లాడాలి. కేవలం ఫోన్లలోనే కనిపిస్తే, క్షేత్రస్థాయిలో ఉండే వృద్ధులు, గ్రామీణ ప్రజలతో కనెక్టివిటీ దెబ్బతినే ప్రమాదం ఉంది. విజయ్ తన డిజిటల్ నెరేటివ్ ను వైరల్ చేస్తున్నా, దానిని ఓటుగా ప్రతీ సారి మార్చుకోలేకపోవచ్చు. ఓ వేవ్ తో మొదటి సారి ఓట్లు పడ్డాయి. కానీ కింది స్థాయిలో బలమైన కార్యకర్తల వ్యవస్థ లేకుండా కేవలం వర్చువల్ ప్రపంచానికే అంకితమైతే, అది రియల్ పాలిటిక్స్‌లో దెబ్బకొట్టే అవకాశం ఉంది.
విజయ్ ప్రయోగం ఫలిస్తుందా?
విజయ్ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం సఫలమైతే, అది దేశవ్యాప్త రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయం అవుతుంది. ఫ్లెక్సీల కాలుష్యం లేని, సామాన్యులే కేంద్రంగా సాగే రాజకీయం చూడముచ్చటగానే ఉన్నా, దాని వెనుక ఉన్న డిజిటల్ రిస్క్ ను విజయ్ ఎలా మేనేజ్ చేస్తారనేది ఆసక్తికరం. నెటిజన్ల నాడిని పట్టుకోవడంలో విజయ్ ఇప్పటివరకు విజయవంతమైనా, ముందు ముదురు అదే వేగం కొనసాగిస్తారో లేదో చూడాలి. సక్సెస్ అయితే అన్ని పార్టీలు అదే చేస్తాయి.
