ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ఆసక్తికరంగా మారిన అంశం స్థానిక సంస్థల ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రస్తుతం అన్ని మార్గాలూ సుగమంగానే కనిపిస్తున్నాయి. వైసీపీ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో తీవ్ర నైరాశ్యంలో ఉండటం, ఆ పార్టీ నేతలు పోటీకి కూడా వెనుకాడే పరిస్థితులు ఉండటంతో కూటమికి గెలుపు నల్లేరుపై నడకే. అయినప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల విషయంలో ఆచి తూచి అడుగులు వేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
కూటమి ఐక్యతకు పొంచి ఉన్న ముప్పు?
ఎన్నికల వాయిదా వెనుక ఉన్న ప్రధాన కారణం కూటమి పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో ఉండాల్సిన సమగ్ర సమన్వయం. అసెంబ్లీ ఎన్నికల్లో పైస్థాయిలో నాయకులు కలిసినా, స్థానిక ఎన్నికల విషయానికి వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా ఉంటుంది. గ్రామ, మండల స్థాయిలో ప్రతి చిన్న నాయకుడికీ రాజకీయ ఆకాంక్షలు ఉంటాయి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల కోసం కూటమిలోని మూడు పార్టీల నేతలు పోటీ పడటం ఖాయం. సీట్ల సర్దుబాటు విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా, అది కిందిస్థాయి కార్యకర్తల మధ్య ఘర్షణకు దారితీసి, తద్వారా కూటమి ఐక్యత దెబ్బతినే ప్రమాదం ఉందని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ అంతర్గత పోరు ప్రత్యర్థులకు అయాచిత వరంగా మారకూడదనేది చంద్రబాబు ఉద్దేశం.
దిగువ స్థాయి నేతల ఆకాంక్షలు – సర్దుబాటు సవాల్
చాలా నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన నేతలు గత ఐదేళ్లుగా వైసీపీని ఢీకొంటూ క్షేత్రస్థాయిలో పట్టు పెంచుకున్నారు. ఇప్పుడు ఎన్నికలు వస్తే తమకే అవకాశం ఇవ్వాలని వారు గట్టిగా కోరుతున్నారు. జనసేన బలంగా ఉన్న ప్రాంతాల్లో ఆ పార్టీ నేతలు, టీడీపీ కంచుకోటల్లో ఆ పార్టీ అభ్యర్థులు పట్టుబట్టడం సహజం. ఈ పరిస్థితుల్లో ఎవరిని బుజ్జగించాలి, ఎవరికి సీట్లు కేటాయించాలనేది కూటమికి పెద్ద సవాల్‌గా మారింది. జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు పటిష్టమైన ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి, అభ్యర్థుల ఎంపికలో ఎటువంటి విభేదాలు రాకుండా చూసుకున్న తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని కూటమి అగ్రనేతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
త్వరలోనే సమర శంఖం!
ఎన్నికలను ఎంతో కాలం వాయిదా వేయలేరనేది వాస్తవం. కేంద్రం నుంచి వచ్చే స్థానిక సంస్థల నిధులు ఆగిపోకుండా ఉండాలన్నా, క్షేత్రస్థాయిలో పట్టు కోల్పోకూడదన్నా ఎన్నికలు జరగాల్సిందే. అందుకే చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పార్టీల మధ్య సమన్వయాన్ని సాధించడంపై దృష్టి సారించారు. ఇప్పటికే జిల్లాల వారీగా పార్టీల బలాబలాలపై నివేదికలు తెప్పించుకుంటున్నట్లు సమాచారం. ఈ సమన్వయ ప్రక్రియ పూర్తయిన వెంటనే, అంటే మరో రెండు మూడు నెలల వ్యవధిలోనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ లోపు కార్యకర్తల మధ్య ఉన్న చిన్న చిన్న భేదాభిప్రాయాలను తొలగించి, ఉమ్మడి వ్యూహంతో ముందుకు వెళ్లడమే కూటమి లక్ష్యం.


