నీట్ పరీక్ష నిర్వహణలో చోటుచేసుకుంటున్న వరుస వైఫల్యాలు, పేపర్ లీకేజీ ఉదంతాలు దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. వన్ నేషన్.. వన్ ఎగ్జామ్ అనే నినాదం వినడానికి బాగున్నా, ఆచరణలో అది ఒకే తప్పుతో దేశం మొత్తాన్ని ఇరుకున పెట్టే వన్ నేషన్.. వన్ డిజాస్టర్ గా మారుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒకే పరీక్ష – కోటి సమస్యలు
దేశవ్యాప్తంగా ఒకటే ప్రవేశ పరీక్ష ఉండాలనే లక్ష్యంతో తెచ్చిన నీట్ సంస్కరణ, ఇప్పుడు అదే విద్యార్థులకు శాపంగా మారింది. మే 3, 2026న జరిగిన నీట్ యూజీ పరీక్షలో రాజస్థాన్లోని సికార్ కేంద్రంగా వెలుగుచూసిన గెస్ పేపర్ లీకేజీ ఉదంతం, ఈ కేంద్రీకృత వ్యవస్థలోని డొల్లతనాన్ని బయటపెట్టింది. ఒక్క చోట పేపర్ లీక్ అయితే, దేశం మొత్తం 23 లక్షల మంది విద్యార్థులు మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి రావడం దారుణం. ఈ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ విధానం వల్ల స్థానిక లోపాలు జాతీయ స్థాయి విపత్తులుగా మారుతున్నాయి. ఒకే పరీక్షపై ఆధారపడటం వల్ల అది మాఫియాకు ఈజీ టార్గెట్గా మారుతోంది. దీనివల్ల ప్రతిభావంతులైన విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు
టెక్నాలజీ యుగంలో పేపర్-పెన్ పరీక్ష?
డిజిటల్ ఇండియా, ఏఐ వంటి సాంకేతిక విప్లవాల గురించి మాట్లాడుకుంటున్న తరుణంలో, ఇంకా ఫిజికల్ క్వశ్చన్ పేపర్లపై ఆధారపడటం పెను తప్పిదమని నిపుణులు భావిస్తున్నారు. నీట్ పీజీ వంటి పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తున్నప్పుడు, యూజీ పరీక్షను ఎందుకు కంప్యూటర్ ఆధారితంగా మార్చలేకపోతున్నారనే ప్రశ్న ఉదయిస్తోంది. పేపర్లను ముద్రించడం, వాటిని దేశవ్యాప్తంగా రవాణా చేయడం వంటి ప్రక్రియల్లోనే లీకేజీలకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆన్లైన్ పరీక్షల వల్ల పారదర్శకత పెరగడమే కాకుండా, లీకేజీ జరిగిన వెంటనే గుర్తించి నష్ట నివారణ చేసే అవకాశం ఉంటుంది. సాంకేతికతను వాడుకోకుండా పాతకాలపు పద్ధతుల్లో పరీక్షలు నిర్వహించడం అంటే విద్యార్థులను ‘టార్చర్’ పెట్టడమేనని విమర్శలు వస్తున్నాయి.
వైద్య విద్యలో దొంగదారి డాక్టర్లు – సమాజానికి ముప్పు!
పేపర్ లీకేజీలు కేవలం ఒక పరీక్షకు సంబంధించిన సమస్య కాదు, ఇది దేశ ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే అంశం. రూ. 20 వేల నుంచి రూ. 2 లక్షలకు పేపర్లు కొనుక్కుని, తప్పుడు దారుల్లో మెడికల్ సీట్లు సాధించే వారు భవిష్యత్తులో ఎటువంటి డాక్టర్లు అవుతారో ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఇలాంటి అక్రమాలు వెలుగుచూసినప్పుడు మాత్రమే దర్యాప్తు జరుగుతోంది తప్ప, వెలుగుచూడని అక్రమాలు ఇంకెన్ని ఉన్నాయో ఎవరికీ తెలియదు. అక్రమ మార్గాల్లో సీట్లు పొందే నకిలీ మెరిట్ వల్ల నిజమైన ప్రతిభ ఉన్న పేద, మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతున్నారు. ఇది కేవలం వ్యవస్థ వైఫల్యం మాత్రమే కాదు, దేశ వైద్య భవిష్యత్తుపై జరుగుతున్న దాడి.
విచారణలతో జరిగే లాభం ఉండదు. విద్యార్థుల శ్రమను, తల్లిదండ్రుల ఆశలను గంగలో కలపకుండా, పారదర్శకమైన.సురక్షితమైన పరీక్షా వ్యవస్థను నిర్మించడమే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్. దాన్ని ప్రభుత్వం పరిష్కరించాలి.
