పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన, లోక్‌సభ స్థానాల పెంపుపై దేశవ్యాప్తంగా సాగుతున్న చర్చలో కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ విసిరిన థాట్ ఎక్స్పెరిమెంట్ సవాల్‌కు ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఇచ్చిన తిరుగులేని కౌంటర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దేశంలో జనాభా నియంత్రణను పాటించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం దెబ్బతినకుండా ఉండేందుకు ఎన్డీయే ప్రతిపాదించిన యాభై శాతం సీట్ల పెంపు ఫార్ములా ను శశి థరూర్ తప్పుబడుతూ.. జీతాల పెంపు ఉదాహరణతో ట్వీట్ చేశారు. అయితే, ఆ ఉదాహరణలోని డొల్లతనాన్ని, థరూర్ కనబరిచిన హేతుబద్ధత లేని తెలివితక్కువతనాన్ని లోకేష్ తన పక్కా రాజ్యాంగబద్ధమైన, లాజికల్ పాయింట్లతో పూర్తిగా ఎండగట్టారు.
శశి థరూర్ తన ట్వీట్
“యజమాని జీతం 2 లక్షలు, డ్రైవర్ జీతం 20 వేలు అనుకుందాం.. ఇద్దరికీ 50 శాతం జీతం పెంచితే యజమానికి 3 లక్షలు, డ్రైవర్‌కు 30 వేలు అవుతుంది. శాతం సమానమే అయినా యజమాని మరింత లబ్ధి పొందుతాడు. అలాగే యూపీ సీట్లు 80 నుండి 120కి, కేరళ సీట్లు 20 నుండి 30కి పెరిగితే.. నిష్పత్తి ఒకటే అయినా పార్లమెంటులో యూపీ పొలిటికల్ వెయిట్ విపరీతంగా పెరుగుతుంది కదా చంద్రబాబు గారూ?” అంటూ శశిథరూర్ తన ట్వీట్లో ప్రశ్నించారు. సాధారణంగా ఎవరికైనా నిజమే కదా అనిపిస్తుంది. కానీ థరూర్ ఎక్కడ లాజిక్ మిస్సయ్యారో నారా లోకేష్ స్పష్టంగా వివరించారు.
జీతాల లెక్క వేరు – ఓట్ల శాతం వేరు
శశి థరూర్ లాంటి అంతర్జాతీయ అనుభవం ఉన్న మేధావి బేసిక్ మ్యాథ్స్, పార్లమెంటరీ ప్రజాస్వామ్య సూత్రాలను ఎలా విస్మరించారో ఎండగట్టేలా నాలుగు బలమైన పాయింట్లతో తిప్పికొట్టారు. జీతాల ఉదాహరణ ఇక్కడ అస్సలు వర్తించదు. ఎందుకంటే పార్లమెంటులో నిర్ణయాలు, ప్రభావాలు ఓట్ల శాతం ఆధారంగా జరుగుతాయి కానీ నోట్ల కట్టల ఆధారంగా కాదు. సభలో ఒక బిల్లు నెగ్గాలన్నా లేదా రాజ్యాంగ సవరణ జరగాలన్నా సాధారణ లేదా మూడింట రెండు వంతుల మెజార్టీ శాతం కావాలి. అన్ని రాష్ట్రాలకూ ఒకే నిష్పత్తిలో సీట్లు పెంచినప్పుడు.. సభలో ఏ ఒక్క రాష్ట్రం లేదా ప్రాంతం ఓటింగ్ సమీకరణాలు మారవు. ఎవరికీ అదనపు లబ్ధి చేకూరదు. అందరికీ సమానంగా 50 శాతం పెరిగినప్పుడు పాత ఈక్వేషన్లు అలాగే ఉంటాయి కానీ ఒకరిపై ఒకరు ఆధిక్యత సాధించడం అనేది అసాధ్యం అంటూ లోకేష్ థరూర్ అపరిపక్వ లాజిక్ ఎంత తెలివి తక్కువ అయినదో వివరించారు.
జనాభా ప్రాతిపదికన జరగాలంటారా?
రాజ్యాంగబద్ధమైన అంశాలను ప్రస్తావిస్తూ లోకేష్ మరింత గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఆర్టికల్ 81 ప్రకారం లోక్‌సభ సీట్ల కేటాయింపు జనాభా ప్రాతిపదికన జరగాలని, 1971 జనాభా లెక్కల ప్రకారం విధించిన తాత్కాలిక నిలిపివేత ఈ ఏడాది 2026తో ముగుస్తోందని గుర్తు చేశారు. ఒకవేళ ఎన్డీయే ఈ 50 శాతం పెంపు ఫార్ములాను తీసుకురాకపోతే, 2026 జనాభా లెక్కల ప్రకారం కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి దక్షిణాది రాష్ట్రాల సీట్లు భారీగా తగ్గిపోయి తీవ్ర అన్యాయం జరుగుతుందని.. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీయే ఆ పాపానికి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని లోకేష్ కడిగిపారేశారు. 1971లో 55 కోట్లు ఉన్న భారత్ జనాభా ఇప్పుడు 146 కోట్లకు చేరిందని, ఒక్కో ఎంపీ ఇప్పుడు గతంలో కంటే 2.5 రెట్లు ఎక్కువ జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని.. అందువల్ల సభను విస్తరించడం ప్రజాస్వామ్య అవసరమని స్పష్టం చేశారు.
ప్రతి పౌరుడికి సమాన ఓటు విలువ
ఏ ఒక్క రాష్ట్రానికి కూడా ఒక ఓటరు ప్రాతినిధ్యం విషయంలో మరో రాష్ట్రం కంటే ఎక్కువ రాజ్యాంగ హక్కు ఉండదని.. ప్రతి పౌరుడి ఓటుకు సమాన విలువ ఉండాలన్నదే రాజ్యాంగ ఆశయమని లోకేష్ హితవు పలికారు. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ఎన్డీయే ఈ నిష్పత్తి ఫార్ములాను తెచ్చిందని, ఇది కాంగ్రెస్ లాంటి పార్టీల పొలిటికల్ ఛాయిస్ కాదు.. దేశ భవిష్యత్తు కోసం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమని లోకేష్ తేల్చిచెప్పారు. లోకేష్ ఇచ్చిన ఈ సుదీర్ఘ, విశ్లేషణాత్మక వివరణతో శశి థరూర్ లాంటి ఇంగ్లిష్ మేధావి సైతం డిఫెన్స్‌లో పడిపోయారని, జాతీయ స్థాయిలో కూటమి వైఖరిని లోకేష్ చాలా సమర్థవంతంగా వినిపించారంటూ నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. దీనిపై థరూర్ స్పందించాల్సి ఉంది.
