ప్రజాస్వామ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ, ఒక సుదీర్ఘమైన నియామక ప్రక్రియ ముగిసి, వేలాది మంది నిరుద్యోగులు ఉపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా డీఎస్సీ చుట్టూ సాగుతున్న రాజకీయాలు ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగాయి. ఈ వివాదానికి శాశ్వత ముగింపు పలకాలనే వ్యూహంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విసిరిన బహిరంగ చర్చ సవాల్ ఇప్పుడు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆత్మరక్షణలో పడేసింది. తాడేపల్లిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి కేవలం 200 మీటర్ల దూరంలో నిలబడి, ఆధారాలు ఉంటే డీఎస్సీపై నాతో నేరుగా చర్చకు రా అని లోకేష్ సవాల్ విసిరి గంటలు గడుస్తున్నా, వైసీపీ శిబిరం నుంచి ఆశించిన స్పందన రావడం లేదు.
నిజాయితీ ఉంటే చర్చకు రావాలి!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తాను డీఎస్సీ విషయంలో రాజకీయం చేయడం లేదని, కేవలం బాధితుల పక్షాన, నష్టపోయిన నిరుద్యోగుల కోసమే మాట్లాడుతున్నానని చెబుతున్న మాటల్లో నిజాయితీ ఉంటే.. ఆయన ఈ సవాల్‌ను స్వీకరించడమే సరైన మార్గం. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వ తప్పులను, రికార్డులలోని అవకతవకలను పక్కా ఆధారాలతో సహా డిబేట్లో ఎండగట్టే సువర్ణావకాశం ఇది. ఒకవేళ ప్రభుత్వం నిజంగానే డీఎస్సీలో స్కామ్ చేసి ఉంటే, దాన్ని లైవ్ డిబేట్లో ప్రజల ముందు నిరూపించి, మంత్రిని నిలదీస్తే జగన్ రెడ్డికి వచ్చే రాజకీయ మైలేజ్ అంతా ఇంతా కాదు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పోయి, జగన్ ఒక తిరుగులేని పీపుల్స్ లీడర్‌గా ఎదిగేందుకు, రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు అది మొదటి మెట్టు అవుతుంది.
పారిపోతే ఫేక్ చేసినట్లే !
కానీ, ఈ అద్భుతమైన అవకాశాన్ని వదిలేసి.. వైసీపీ శ్రేణులు కేవలం ప్రెస్ మీట్లకే పరిమితమై ఎదురుదాడి చేయడం, సాంకేతిక అంశాలను వక్రీకరిస్తూ పాత విమర్శలనే వల్లించడం చూస్తుంటే వారి వద్ద పక్కా ఆధారాలు లేవా? అనే సందేహం సామాన్యుల్లో సైతం వ్యక్తమవుతోంది. అధికారుల వివరణలను, అభ్యర్థుల ఆన్లైన్ దరఖాస్తుల రికార్డులను ప్రభుత్వం బహిరంగంగా చూపిస్తున్నా.. వాటిని సవాల్ చేసే ధైర్యం లేకనే వైసీపీ చర్చకు ముఖం చాటేస్తోందనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా సాగుతోంది. మైకుల ముందు గంటల తరబడి మాట్లాడే నేతలు, ముఖాముఖి కూర్చుని పాయింట్ టు పాయింట్ మాట్లాడటానికి వెనుకాడటం వారి బలహీనతను స్పష్టం చేస్తోంది.
ప్రజల్లో పరువుపోతుంది!
నిజానిజాలు తేల్చే డిబేట్‌కు గనుక జగన్ రెడ్డి రాకపోతే.. ఆయన చేస్తున్నవన్నీ ఫేక్ దాడులని, చెట్టు చాటు నుంచి బురద చల్లి పారిపోయే రాజకీయ వ్యూహంలో భాగమేనని ప్రజలు భావించాల్సి వస్తుంది. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా నిరుద్యోగుల, ఉపాధ్యాయ అభ్యర్థుల భావోద్వేగాలతో ఆడుకుంటూ, వారి కామన్ సెన్స్‌ను అవమానించేలా ఈ వ్యవహారం తయారైంది. ఇప్పటికైనా అబద్ధాల ప్రచారానికి తెరదించి, నిజంగానే వ్యవస్థలో లోపాలు జరిగాయని నమ్మితే.. జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు వచ్చి నారా లోకేష్‌తో ముఖాముఖి చర్చకు కూర్చోవాలి. లేకపోతే ఈ డీఎస్సీ రాజకీయం వైసీపీకి మరో కోలుకోలేని సెల్ఫ్ గోల్‌గా మారుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
