తెలంగాణ ఉద్యమం పీక్స్ లో ఉన్నప్పుడు కేసీఆర్ ఇలా పిలుపు ఇవ్వగానే అలా తండోపతండాలుగా జనం వచ్చేవారు. రాష్ట్ర స్థాయి బహిరంగసభలు నిర్వహించాలంటే కేసీఆర్ ప్లానింగ్ ఓ రేంజ్ లో ఉండేది. ఉద్యమం సమయంలో ఉద్యమం ఊపు.. అధికారంలో ఉన్నప్పుడు ఆ పవర్ కలగలిపి సభలను ఓ రేంజ్ లో నిర్వహించేవారు. కానీ ఇప్పుడు అటు ఉద్యమ వేడి.. ఇటు అధికారం రెండూ లేవు. ఇలాంటి సమయంలో పార్టీ రజతోత్సవం సభ నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటి స్థాయిలోనే నిర్వహించాలని నేతలంతా కష్టపడుతున్నారు.
కేసీఆర్ ఫాంహౌస్లో ఉండి వరంగల్ సభ నిర్వహణపై పూర్తి స్థాయిలో వ్యూహం సిద్ధం చేస్తున్నారు. జన సమీకరణ ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభావం ఏ మాత్రం తగ్గలేదని.. ప్రజల్లో పార్టీపై ఆదరణ అంతే ఉందని నిరూపించాలని కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు. నిజానికి గత రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించిన ఫలితాలు ఘోరంగా ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో సగం సీట్లలో డిపాజిట్లు కోల్పోవడం అంటే పునాదులు కదిలిపోయినట్లే. అలాంటిదేమీ లేదని.. నిరూపించేందుకు ఇప్పుడు సభ ద్వారా ప్రయత్నిస్తున్నారు.
ఇప్పుడు జన సమీకరణ అంత ఈజీ కాదు. పార్టీ నేతలు .. ద్వితీయ శ్రేణి క్యాడర్ పార్టీకి దూరమయ్యారు. కొంత మంది సైలెంటుగా ఉంటున్నారు. ఆన్ లైన్ లో చూపించినంత ఊపు ఆఫ్ లైన్ చూపించడం లేదు. ఇలాంటి సవాళ్ల మధ్య రజతోత్సవం సభను అనూహ్యమైన జనాదరణతో నిర్వహించకపోతే.. బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా ఉందన్న సంకేతాన్ని తామే ప్రజల్లోకి పంపినట్లుగా అవుతుంది. అందుకే ఈ విషయంలో కేసీఆర్ పూర్తి స్థాయిలో వర్కవుట్ చేస్తున్నారు.