ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ రాష్ట్రంలో పాలనా విప్లవానికి నాంది పలికింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్‌కు అనుగుణంగా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రూపొందించిన ఈ విధానం ఏడాది పూర్తి చేసుకుంది. అప్పుడే 50 లక్షల మంది యూజర్ల మైలురాయిని చేరుకుంది. ఇప్పటివరకు దాదాపు 2.50 కోట్లకు పైగా లావాదేవీలు జరగడం విశేషం. కేవలం ఒక హాయ్ తో ప్రభుత్వ సేవలను అరచేతిలోకి తీసుకురావడమే కాకుండా, కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలను తప్పించి సామాన్యుడి సమయాన్ని, సొమ్మును ఈ యాప్ ఆదా చేస్తోంది.
ఎక్కడ ఉన్నా.. సేవలు అరచేతిలోనే
మనమిత్ర కేవలం రాష్ట్రంలో ఉన్న వారికే కాకుండా, ఉద్యోగ రీత్యా బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో స్థిరపడిన ఏపీ ప్రజలకు వరంగా మారింది. ఇంటి పన్నులు చెల్లించాలన్నా, పట్టాదారు పాసుపుస్తకాలు డౌన్లోడ్ చేసుకోవాలన్నా, గతంలో లాగా పనులు మానుకుని సొంతూళ్లకు రావాల్సిన అవసరం ఇప్పుడు లేదు. చిత్తూరు నుంచి సిక్కోలు వరకు అనేకమంది పౌరులు తమ మొబైల్ ఫోన్ ద్వారానే సర్టిఫికెట్లు పొందడం, ఆలయ దర్శన టికెట్లు బుక్ చేసుకోవడం వంటి పనులను క్షణాల్లో పూర్తి చేసుకుంటున్నారు. ఈ డిజిటల్ సౌలభ్యం ప్రజల్లో ప్రభుత్వం పట్ల అపారమైన నమ్మకాన్ని పెంచింది.
వెయ్యికి పైగా సేవలు – ఏఐ టెక్నాలజీ
ఆర్టీసీ బస్సు టికెట్ల నుంచి ఈసీ కాపీల వరకు, తల్లికి వందనం దరఖాస్తుల నుంచి కరెంటు బిల్లుల వరకు దాదాపు 900కు పైగా సేవలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఈ నెలాఖరుకు ఈ సంఖ్య వెయ్యి దాటనుంది. టైపింగ్ రాని వారి కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వాయిస్ మెసేజ్ సౌకర్యం కూడా ఉండటం చదువు రాని వాళ్లూ ఈ యాప్ వినియోగాన్ని సులువు చేస్తోంది. తెలుగు , ఇంగ్లీషు భాషల్లో పనిచేసే ఈ వ్యవస్థ, సాంకేతికతను సామాన్యుడికి చేరువ చేయడంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.
ప్రజల ప్రశంసలు
ప్రభుత్వం ప్రజల వద్దకే వెళ్లాలనే లక్ష్యం మనమిత్ర ద్వారా క్షేత్రస్థాయిలో సాకారమవుతోంది. సచివాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, పారదర్శకంగా పనులు జరుగుతుండటంతో ప్రజల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దళారుల బెడద లేకపోవడం, ఎక్కడి నుంచైనా సేవలు పొందే వీలుండటంతో మహిళలు, ఉద్యోగులు, రైతులు మనమిత్ర ను తమ ఆత్మీయ మిత్రునిగా భావిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఈ వినూత్న ప్రయోగం డిజిటల్ గవర్నెన్స్‌లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.
