డీజీపీ అవ్వాల్సిన ఐపీఎస్ ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆయన ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారో .. పోయిన పరువుంతా పోయింది ఇక కొత్తగా ఏం పోతుందని తెగించాలని అనుకుంటున్నారో కానీ అసలు తనతో తప్పులు చేసిన వారిపై మాత్రం ఈగ వాలనిచ్చేందుకు సిద్ధం కావడం లేదు. కుక్కల విద్యాసాగర్ సాయం చేయమని వస్తే.. అదేంటో చూడాలని విశాల్ గున్ని, కాంతిరాణా టాటాలకు చెప్పానని ఆయన అంటున్నారు.
కుక్కల విద్యాసాగర్ సాయం చేయమని వస్తే ఆయన కోసం ముంబై నటిని అక్రమ అరెస్టు చేసేందుకు పోలీసు మాఫియాలా వ్యవహరించాలని ఆదేశిస్తారా?. చూడమని చెప్పగానే.. విశాల్ గున్ని, కాంతిరాణా టాటా ఓ చూపు చూసి వస్తారా? . ఈ వ్యవహారం పరిణామాలు ఎలా ఉంటాయో వారికి తెలియదా? . ఇంత జరుగుతున్నా.. తనను కుక్కల విద్యాసాగర్ సాయం చేయమని అడిగారని అంటున్నారు కానీ సజ్జల, జగన్ చెప్పారని మాత్రం ఆయన చెప్పడం లేదు.
కుక్కల విద్యాసాగర్ ఏమీ వైసీపీలో కీలక స్థానంలో లేడు. ఆయన రాజకీయంగా యాక్టివ్ గా లేడు. కేవలం జత్వానీతో పరిచయం ఉన్న వాడు కావడం వల్లనే అతనితో తప్పుడు ఫిర్యాదులు ఇప్పించారు. అతన్ని కూడా పావుగా వాడుకున్నారు. ఓ పారిశ్రామికవేత్తను రక్షించడం కోసం ఇక్కడ తప్పుడు కేసులు పెట్టి చట్టాన్ని దుర్వినియోగం చేశారు. అంతా సజ్జల, జగన్ సూచీలతోనే జరిగింది. అయితే ఈ విషయాన్ని మాత్రం ఆయన పోలీసులకు చెప్పడం లేదు. తన మాఫియా బాసులను కాపాడేందుకు సుదీర్ఘ సర్వీస్ ఉన్న ఐపీఎస్ అధికారి ఇంకా ప్రయత్నిస్తున్నారు. ఇది ఆయన విలువల పతనానికి సాక్ష్యం. ఇప్పటికీ ఆయన దీన్ని తెలుసుకోలేకపోతున్నారు.