ఏపీ రాజధాని పునరుజ్జీవనం దిశగా కీలక అడుగు పడింది. అమరావతి అభివృద్ధికి ప్రధాని మోడీ భరోసా ఇచ్చారు. అమరావతి అభివృద్ధి వికసిత్ భారత్ కు పునాది అని మోడీ చెప్పడం హైలెట్ గా చెప్పొచ్చు. ఎందుకంటే అభివృద్ధి విషయంలో వికసిత్ భారత్ ఎజెండాగా కేంద్రం నిధుల కేటాయింపు చేపడుతోంది. ఇప్పుడు ఇందులో అమరావతిని భాగం చేయడమంటే రాజధాని నిర్మాణంకు ఇక ఎలాంటి డోఖా లేనట్లే.
ఇక,రాజధాని విషయంలో వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నాన్చుతోంది. ఇప్పుడు ఆ పార్టీ నిర్ణయంతో ఎలాంటి పని లేదు. కానీ పార్టీకి ఓ విధానం అంటూ ఉండాలి. దీంతో మూడు రాజధానులకే ఆ పార్టీ ఇంకా కట్టుబడి ఉందని, అందుకే అమరావతి విషయంలో నాన్చుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోడీ అమరావతికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పాక కూడా వైసీపీ వైఖరి మార్చుకోకపోతే ఆ పార్టీని స్వయంగా భూస్థాపితం చేసుకోవడమే అవుతుంది.
నిజానికి, అమరావతికి అండదండలు ఉంటాయని, ఈమేరకు మోడీ హామీ ఇస్తారని వైసీపీ అంచనా వేసి ఉండొచ్చు. కానీ , నిర్మొహమాటంగా చంద్రబాబును మోడీ ప్రశంసిస్తారని ఊహించకపోవచ్చు. పైగా టెక్నాలజీ విషయంలో తన కంటే చంద్రబాబే ముుందుంటారని మోడీ చెప్పడం వైసీపీకి జీర్ణం కాకపోవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
అలాగే రాజధానిలో పెద్ద, పెద్ద నిర్మాణాలు చేపట్టడంలో చంద్రబాబు సిద్దహస్తుడు అని స్వయంగా ప్రధాని క్రెడిట్ ఇచ్చారు. ఊహించని విధంగా బాబుపై మోడీ ప్రశంసలు కురిపించడంతో వైసీపీ నేతల ముఖ చిత్రాలేమిటో అంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు దర్శనమిస్తున్నాయి.