పదవులు ఆశించేవారు ఎక్కువగా ఉన్నారని మంత్రి వర్గాన్ని విస్తరించలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ కనీసం కింది స్థాయి క్యాడర్ కు అయినా పదవులు ఇచ్చి న్యాయం చేయాలని అనుకోవడం లేదు. అక్కడా పోటీ పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అయినా.. పార్టీ కోసం కష్టపడిన వారికి ఎదురు చూపులు తప్పడంలేదు.
గతేడాది మార్చి నెలలో కొందరికి చైర్మన్, డైరెక్టర్ పదవులు ఇచ్చారు. ఆ తరువాత నుంచి నామినేటెడ్ పదవుల జాతర అని ప్రచారం జరుగుతూనే ఉంది కానీ.. జాబితా మాత్రం రిలీజ్ కావడం లేదు. కొత్త ఇంచార్జ్ వచ్చాక.. పదవుల జాబితా రెడీ అయిందనుకున్నారు. ఆమె జిల్లా సమీక్షలు పెడుతున్నారు కానీ పదవుల గురించి చెప్పలేకపోతున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఈ పదవులు పెద్ద సమస్యగా మారాయి. పార్టీ నేతల నుంచి ఒత్తిడి వస్తూండటంతో త్వరలో అని అందర్నీ బుజ్జగిస్తున్నారు.
రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కార్పొరేషన్ చైర్మన్‌తోపాటు డైరెక్టర్ పోస్టులు, జిల్లా చైర్మన్ పోస్టులు భర్తీ కాకుండా ఖాళీగా ఉన్నాయి. వంద వరకు కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు ఉన్నాయి. అందులో 70కిపైగా భర్తీ చేయాల్సి ఉంది. అప్పుడప్పుడు ఒక్కరికి పదవి ప్రకటిస్తున్నారు. కానీ పదవుల కోసం ఎదురు చూస్తున్న చాలా మందికి మాత్రం నిరాశ తప్పడం లేదు. పరిస్థితి ఇలా ఉంటే.. క్యాడర్ పూర్తిగా నిరాశలో కూరుకుపోతుందని అది పాలక పార్టీకి మంచిది కాదని ఆ పార్టీలోనే ఫీడ్ బ్యాక్ వస్తోంది. అయితే కాంగ్రెస్ లో అలాంటివి పట్టించుకోరు. తాము చేయాలనుకున్నప్పుడే.. తీరిక ఉన్నప్పుడే చేస్తారు.