ఆలయాల్లో దేవుడిని దర్శించుకోవాలంటే ఇప్పుడు అంత తేలిక కాదు. కాస్త పేరున్న ఆలయాలకు దర్శనానికి వెళ్లాలంటే ముందస్తుగా ప్రణాళికలు వేసుకోవాలి. లేకపోతే నానా తంటాలు పడతారు. ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన రోజులు అనుకుంటే.. ఆలయాలు పట్టనంతగా భక్తులు వస్తున్నారు. ఇది అనేక సమస్యలకు కారణం అవుతోంది. రెండు, మూడు రోజుల వ్యవధిలోనే విశాఖ, గోవాల్లో జరిగిన ఆలయాల్లో జరిగిన ఘటనల్లో పలువురు భక్తులు చనిపోయారు. అంతకు ముందు తిరుపతిలో శ్రీవారి దర్శన టిక్కెట్ల కోసం జరిగిన తొక్కిసలాట ఘటనను మర్చిపోలేం.
ఆలయాలు కిటకిట – ప్రత్యేక రోజుల్లో ఊహించనంత రష్
కొద్ది కాలం కిందట వరకూ ఆలయాల్లో రష్ ఉండేది కానీ..ఇంత తీవ్ర స్థాయిలో ఉండేది కాదు. తిరుమలోనే ఉదాహరణగా తీసుకుంటే.. ఐదారేళ్ల కిందటి వరకూ రోజుకు యాభై వేల మంది భక్తులు వస్తే రద్దీ ఉన్నట్లు.కానీ ఇప్పుడు కనీసం 80వేల మంది వస్తున్నారు. ఒకప్పుడు భక్తుల రద్దీ 30వేలు దాటితే మహాలఘు దర్శనం అమలు చేసేవారు. తర్వాత అంతా మహాలఘు దర్శనమే ..సాధారణ దర్శనం అయిపోయింది. తిరుపతికి ఇటీవలి కాలంలో ఉత్తరాదికి చెందిన భక్తుల రాక కూడా పెరిగిపోయింది. అలాగే శ్రీశైలం, విజయవాడ , సింహాచలం సహా ఇతర ప్రముఖ ఆలయాల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది.
దేశవ్యాప్తంగా అదే ట్రెండ్
ఒక్క ఏపీలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఆలయాలు కిటకిటలాడిపోతున్నాయి. అయోధ్య రాముని దర్శనం కోసం ఇక్కడి నుంచి వెళ్తున్నారు. కుంభమేళాకు జాతరలా ఎలా వెళ్లారో అందరికీ తెలుసు. దేశ ప్రజల్లో భక్తి పెరుగుతోందా లేకపోతే.. సమస్యలు పెరుగుతున్నాయా అన్నది అంచనా వేయలేరు.కష్టాలు వచ్చినప్పుడు అందరికీ దేవుడు గుర్తుకొస్తాడు. అయితే ఇప్పుడు మారుతున్న జీవనశైలితో ..మానసిక ప్రశాంతత కోసం కూడా దేవుడి దర్శనం కోసం వస్తున్నారు. ఇలాంటి వారి సంఖ్య పెరిగిపోతూండటంతో ఆలయాలు కిటకిలటాడుతున్నాయి.
అథ్యాత్మిక ప్రపంచం వైపు ఎక్కువ మంది చూపు !
దేవుడిపై భక్తి , అథ్యాత్మిక అనేది ఓ క్రమబద్ధమైన జీవితానికి ఎంతో ఉపయోగం. ఫలానా ఆలయానికి.. ఫలానా రోజు వెళ్లి దేవుడని దర్శించుకుని కోరిక కోరుకుంటే నెరవేరుతుందనే నమ్మకం పెట్టుకోకూడదని అథ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున ఒకప్పుడు అంత గొప్ప రష్ ఉండేది కాదు.. ఇప్పుడు ఊహించడం కష్టం. రాను రాను ఇలాంటి నమ్మకాలు పెరిగిపోవడం వల్ల దేవుడి సన్నిధిలో ఘోరాలు జరుగుతున్నాయి. అథ్యాత్మికత గురించి, దేవుడి గురించి బాగా అధ్యయనం చేస్తే.. దేవుడ్ని కొలవడానికి ఉన్న మార్గాలపై స్పష్టత వస్తుందని అనేక మంది ప్రవచనకారులు చెబుతున్నారు. ఆలయాలపై ఒత్తిడిని తగ్గించడానికి భక్తులకు కొన్ని విషయాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఏర్పడుతోంది.