రాజకీయంగా ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా దేశం విషయానికి వచ్చే సరికి ప్రజలంతా ఏకంగా ఉండాలి. రాజకీయ వ్యతిరేకతతో శత్రుదేశం ఎజెండాను అమలు చేయాలని అనుకుంటే అంత కంటే దేశద్రోహం ఉండదు. ప్రస్తుతం కొంత మంది ఇలాంటి దేశద్రోహానికి పాల్పడేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. సోషల్ మీడియా ఉందని ..ఏదైనా మాట్లాడవచ్నని చెలరేగిపోతున్నారు. పాకిస్తాన్ లో వైరల్ అయిపోతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటే దేశం మొత్తం సమర్థిస్తుంది. ప్రశ్నిస్తున్నామని చెప్పి దేశానికి ద్రోహం చేసే వారిని క్షమించాలని ఎవరూ అనుకోరు.
పాకిస్తాన్ వాదన వినిపిస్తున్న ఎడ్డెం అంటే తెడ్డెం బ్యాచ్
మనుషుల మనస్థత్వాలు ఒక్కలా ఉండవు. కొంతమంది అందరూ ఏది మాట్లాడుతూంటే దానికి భిన్నంగా మాట్లాడితే ప్రచారం, గుర్తింపు వస్తాయనుకుంటారు. అయితే ఇలా ఎప్పుడు మాట్లాడాలన్నదానిపై అలాంటి వారికి విచక్షణ ఉండాలి. కానీ ఉండకపోవడం వల్లనే సమస్య. ఇప్పుడు అదే సమస్య వచ్చింది. కొంత మంది మేధావుల పేరుతో గొప్పగా ప్రశ్నిస్తున్నామని చెప్పి.. అడ్డగోలు ప్రశ్నలు వేస్తున్నారు. ఉగ్రవాదం లేదని మోదీ హామీ ఇచ్చాకే వాళ్లు వెళ్లారని.. వాళ్లను చంపేస్తే మోదీ బాధ్యత వహించాలని అంటున్నారు. దొంగలు పడకుండా అన్ని రక్షణలు ఏర్పాటు చేసుకుంటాం… అయినా దొంగలు పడితే దొంగల్ని కాకుండా.. ఇంట్లో ఓనర్లను నిందిస్తారా?. వాళ్ల అజాగ్రత్త ఉంటే దొంగల ముందు పోట్లాడుకోరుగా.. ! ఆ కుటుంబమే చర్చించుకుంటుంది. ఇక్కడ దేశం కూడా ఓ కుటుంబం లాంటిది. చర్చించాల్సిన చోట చర్చించాలి. ఉగ్రదాడులపై పాకిస్తాన్ వాదనను సమర్థించేలా ఇక్కడి మేధావులు చేస్తున్న వాదన పాకిస్తాన్ లో వైరల్ అవుతోందంటే.. ఎవరి వాదనకు వీరు మద్దతిస్తున్నట్లు ?
ఉగ్రవాదులకు పాకిస్తాన్ మద్దతు లేదని ఎలా చెబుతారు?
వారికి తమ సపోర్టు లేదని పాకిస్తాన్ చెబుతుంది. కానీ కశ్మీర్ అంశాన్ని వారం రోజుల ముందే ప్రస్తావించి.. వారంలో దాడులు చేయించిన ఆర్మీ జనరల్ మనీర్ వ్యవహారం కళ్ల ముందే ఉంది. అంతర్జాతీయ టెర్రరిస్టు హాఫీజ్ సయీద్ పాక్ ప్రధాని కన్నా ఎక్కువ సెక్యూరిటీలో ఎలా ఉంటున్నారు?. దావూద్ ఇబ్రహీంను ఎందుకు కాపాడుతున్నారు?. ఇవన్నీ తెలియనివా?. కశ్మీర్ యువతను రెచ్చగొట్టి ఉగ్రవాదులుగా మార్చేది పాక్ సైన్యమే అన్నది బహిరంగరహస్యం. కానీ తాము ఉగ్రబాధితులమేనని.. తమ ప్రమేయం లేదని పాకిస్తాన్ చెప్పుకుంటుంది. వారు ఉగ్రవాదాన్ని పెంచి పోషించి దానికి బలవుతున్నారు. మన దేశానికి సమస్యగా మారుతున్నారు. ఈ నిజాలను అంగీకరించకుండా పాకిస్తాన్ పాపం మంచిది అని మన దేశంలో ఉండి దేశద్రోహానికి పాల్పడితే ఎలా?
దేశం కోసమూ మద్దతుగా ఉండకపోతే జన్మ వ్యర్థం
రాజకీయాల్లో భాగంగా మోదీని వ్యతిరేకించవచ్చు. కానీ దేశాన్ని వ్యతిరేకించడం అంటే.. మోదీని వ్యతిరేకించడమే అనే భావజాలం నుంచి బయటకు రావాలి. పాకిస్తాన్ ను ఏ మాత్రం ఉపేక్షించినా… వైరస్ లా దేశంలో పాకిపోయి ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తారు. ఓ పాతికేళ్ల కిందట హైదరాబాద్ సహా అనేక చోట్ల బాంబు పేలుళ్లతో హోరెత్తిపోయేవి. తర్వాత పూర్తి స్థాయిలో కట్టడి అయ్యాయి. ఇప్పుడు ఏ మాత్రం ఉపేక్షించినా మళ్లీ వస్తాయి. ఇలాంటి పరిస్థితులు రావడానికి అంతర్గత శత్రువులే కారణం అవుతున్నారు. మోదీని అన్ని అంశాల్లో ప్రశ్నించవచ్చు కానీ.. దేశ భద్రత విషయంలో మాత్రం మద్దతు పడకపోయినా పర్వాలేదు.. సైలెంటుగా ఉండాలి. అంతే కానీ పాకిస్తాన్ వాదన వినిపిస్తే మాత్రం.. దేశద్రోహులవుతారు. కన్న తల్లికి అన్యాయం చేసిన వారవుతారు.
పాకిస్తాన్ అమ్మాయి ఓ పాట పాడింది..ఇక్కడ వైరల్ అయింది. నేను మాట్లాడిన మాటలు పాకిస్తాన్ లో వైరల్ అయ్యాయి. వాళ్లు ఆ అమ్మాయిపై కేసు పెట్టలేదు.. ఇక్కడ మాత్రం నాపై కేసు పెట్టారని ఓ పాకిస్తానీ అనుకూల భారత యూట్యూబర్ పెద్దలాజిక్ గా చెప్పారు. పాక్ అమ్మాయి పాట మాత్రమే పడింది..భారత్ కు అనుకూలంగా మాట్లాడలేదు.. కానీ ఇక్కడీ మేధావి పాకిస్తాన్ వాదన వినిపించింది . రెండూ ఒకటేనా?. ఇలాంటి తెలివితేటలే దేశానికి అతి పెద్ద ప్రమాదం.