సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తన లైనప్ ని వేరే లెవల్లో సెట్ చేసుకొనే పనిలో ఉన్నాడు. ‘ఉప్పెన’తో తన స్టామినా అర్థమైపోయింది. ఆ వెంటనే రామ్ చరణ్‌కి ఓ కథ చెప్పి ఓకే చేయించుకొన్నాడు. సెట్స్ పైకి వెళ్లడం కాస్త ఆలస్యమైంది. కాకపోతే ‘పెద్ది’ గ్లింప్స్ చూసి అంతా అవాక్కయ్యారు. గ్లింప్స్‌తోనే అందరి దృష్టినీ తన వైపు తిప్పుకొన్నాడు బుచ్చి. ‘పెద్ది’ తరవాత బుచ్చి ఏం చేయబోతున్నాడు? అనే విషయంపై ఇప్పుడిప్పుడే ఓ క్లారిటీ వస్తోంది. ‘పెద్ది’ అయ్యాక మహేష్ బాబుతో బుచ్చిబాబు ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కూడా సుకుమార్ వల్ల సెట్ కాబోతోందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ‘వన్’ సినిమాకు బుచ్చి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. ఆ సమయంలో మహేష్ తో సాన్నిహిత్యం ఏర్పడింది. ‘ఉప్పెన’ తరవాత కూడా మహేష్, బుచ్చి కలుసుకొన్నారు. ‘మంచి కథ ఉంటే చెప్పు, చేద్దాం’ అని మాట ఇచ్చాడట మహేష్. అందుకే.. మహేష్ కోసం ఓ కథ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. ఈసారి బుచ్చి యాక్షన్ డ్రామా రాస్తున్నాడని, మహేష్‌ని నెక్ట్స్ లెవల్లో చూపించే ప్రయత్నాల్లో బుచ్చి ఉన్నాడన్నది ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. మహేష్ ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వడానికి కనీసం మరో యేడాదైనా పడుతుంది. ‘పెద్ది’ 2026 మార్చిలో విడుదల అవుతుంది. అంటే… రాజమౌళి సినిమా ముగిసే సరికి బుచ్చిబాబు రెడీగానే ఉంటాడు. సో.. ఈ కాంబోకి పెద్దగా అవరోధాలు ఉండకపోవొచ్చు.
కాకపోతే రాజమౌళి సినిమా తరవాత ఎలాంటి సినిమా చేయాలి? అనే విషయంలో హీరోలు గందరగోళంలో ఉంటారు. రాజమౌళి సినిమా అంటే తప్పకుండా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టే ప్రాజెక్టే. అందులో అనుమానం ఏం లేదు. అలాంటి సినిమా తరవాత మహేష్ ఏం చేస్తాడన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంటుంది. బుచ్చిబాబు లాంటి యువ దర్శకులతో సినిమా సెట్స్‌పైకి తీసుకెళ్తే – అంచనాల భారం కాస్త తగ్గుతుంది. ఓరకంగా మహేష్ కు అది మంచి ఆలోచనే. కాకపోతే రాజమౌళి సినిమా పూర్తయి, బయటకు వచ్చేంత వరకూ తదుపరి సినిమాపై నిర్ణయానికి వచ్చే అవకాశాలు లేవు. ఈలోగా ఎవరి ప్రయత్నాలు వాళ్లవి. కాకపోతే బుచ్చిబాబు, మహేష్ బాబు కలిస్తే మాత్రం కచ్చితంగా కాంబినేషన్ పరంగా ఓ క్రేజ్ ఏర్పడుతుంది. ఎన్టీఆర్ తో కూడా బుచ్చిబాబు ఓ సినిమా చేయాల్సివుంది. నిజానికి ‘పెద్ది’ ఐడియా ముందుగా ఎన్టీఆర్కే చెప్పాడు బుచ్చిబాబు.