ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్న సమయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో బయటపడిన నోట్ల కట్టల వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడిన మాట నిజమేనని నివేదిక రావడంతో ఆయన వైదొలిగితే మంచిదన్న సంకేతాలను పంపింది. సుప్రీంకోర్టు కొలిజీయం .. జస్టిస్ యశ్వంత్ వర్మను న్యాయమూర్తి పదవికి రాజీనామా చేస్తే మేలని సంకేతాలు పంపింది. అలా చేయడం వల్ల వ్యవస్థ విశ్వసనీయతను కాపాడుకున్నట్లు అవుతుందని సుప్రీంకోర్టు భావన.
జస్టిస్ యశ్వంత్ వర్మ ను ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. కానీ అక్కడ ఆయనకు ఎలాంటి విధులు అప్పగించలేదు. కేసుల విచారణకు అవకాశం కల్పించడం లేదు. నోట్ల కట్టలపై విచారణ పూర్తి తర్వాత నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. ఇప్పుడు నిజమని తేలిపోయింది. ఆయన తన డబ్బు కాదని వాదిస్తున్నారు. ఆయన డబ్బు కాకపోతే ఆయన ఇంట్లో ఉండే అవకాశం లేదు. ఎలాగైనా బుకాయించవచ్చు.. కానీ ఇక్కడ ఆయనను తప్పించడం అంత తేలికగా.. సొంతంగా వైదొలిగితే తప్ప.
కొలిజీయం న్యాయమూర్తుల్ని నియమించేందుకు సిఫారసు చేయగలదు తప్ప..తీసేసేందుకు సిఫారసు చేయలేదు. మహా అయితే బదిలీకి సిఫారసు చేస్తుంది. తీసేయాలంటే ఖచ్చితంగా పార్లమెంట్ లో అభిశంసన చేపట్టాల్సి ఉంటుంది. యశ్వంత్ వర్మ విషయంలో అభిశంసన చేపడితే ఏ ఒక్క పార్టీ వ్యతిరేకించకపోవచ్చు. కానీ అలాంటి ప్రక్రియ వరకూ జస్టిస్ యశ్వంత్ వర్మ తెచ్చుకుంటారా లేకపోతే వైదొలుగుతారా అన్నదే ప్రశ్న. న్యాయమూర్తులకు ఉన్న ప్రివిలేజెస్ కారణంగాణ ఆ నోట్ల కట్టలు ఎక్కడినుంచి వచ్చాయన్నదానిపై ఇంకా విచారణ చేయడం లేదు.
ఇప్పుడు జస్టిస్ యశ్వంత్ వర్మ బెంచ్ లో కూర్చుని విచారణ జరిపినా దానికి విశ్వసనీయత ఉండదు . ఆయనకు ఉన్న ఒకే ఒక్క మార్గం గౌరవంగా వైదొలగడం. అయితే వైదొలిగితే తాను తప్పు చేశానని అంగీకరించినట్లు అవుతుందని ఆయన బెట్టు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అలాంటి సూచనలు పంపారు. న్యాయవ్యవస్థ పై నమ్మకాన్ని, గౌరవాన్ని కాపాడాల్సిందిగా అందులో ఉన్నవారే. మరి జస్టిస్ వర్మ ఏ నిర్ణయం తీసుకుంటారో ?