ఫక్తు వైసీపీ నాయకులుగా చెలామణి అయిన వారికి ఇప్పుడు అసలు రాజకీయం ఏంటన్నది బోధపడుతోంది. నాడు అధికారమత్తులో నేతలు కొట్టిన డైలాగ్ లకు గుడ్డిగా జేజేలు పలికిన నాయకులు.. ఇప్పుడు వాస్తవంలోకి వస్తున్నారు. తాము ఎంత మోసపోయామో, ఎంతలా మోసగించారో ఇప్పుడు అర్థం అవుతుందని రియలైజ్ అవుతున్నారు. కీలక నేతల గొడుగు కింద ఉండి ఇష్టారీతిన మాట్లాడామని, అదెంత తప్పో ఇప్పుడు తెలిసి వస్తుందని లెంపలు వేసుకుంటున్నారు.
మాజీమంత్రి కొడాలి నానికి అత్యంత సన్నిహితుడు, కృష్ణా జిల్లా వైసీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ ఖాసిం సంచలన ప్రకటన చేశారు. కొడాలి నాని వైఖరితో విసిగిపోయామని, ఇక రాజకీయ సన్యాసం చేస్తున్నట్లు ప్రకటించారు. నానిని నమ్మి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలో వరదలు ముంచెత్తినప్పుడు కనీసం బాధితులను పరామర్శించేందుకు కొడాలి నాని రాలేదని చెప్పుకొచ్చారు.
ఎన్నికల తర్వాత మొత్తం పార్టీని గాలికి వదిలేశారని కొడాలి నాని వైఖరిని తూరారబట్టారు మహమ్మద్ ఖాసిం. పార్టీనే నమ్ముకున్న నాయకులను, కార్యకర్తలను ఆయన పట్టించుకోలేదని , కనీసం వరదల్లో సర్వం కోల్పోతే పరామర్శకు కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నందివాడ మండలం మునిగిపోయి, ప్రజలంతా ఇబ్బందులు పడుతుంటే కనీసం అటువైపు చూడలేదన్నారు.
గుడివాడ ఎమ్మెల్యే రాముపై ఎన్నికల సమయంలో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరుతున్నట్లు చెప్పారు మహమ్మద్ ఖాసిం. రాజకీయాలకు కొత్త అర్థం చెప్పేలా , నిత్యం ప్రజల మధ్యే ఉంటూ ఆయన సేవ చేస్తున్నారని ప్రశంసించారు. ఎన్నికలు ముగియగానే రాము అమెరికా పారిపోతాడని అబద్దపు ప్రచారం చేశామని, అందుకు క్షమాపణ కోరుతున్నట్లు చెప్పారు.
మమ్మల్ని తప్పుదోవ పట్టించిన కొడాలి నాని ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో కూడా తెలియడం లేదని, ఇక రాజకీయాలకు దూరంగా ఉంటానని ఖాసిం సంచలన ప్రకటన చేశారు. మొత్తానికి కొడాలి నాని ఖాతాలో వైసీపీ ఓ కీలక వికెట్ కోల్పోయింది.