అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ మాత్రం సిగ్గుపడరు. తనకు కావాల్సిందేదో నిర్మోహమాటంగా అడుగుతారు. తాను మొదటి సారి అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు చేసిన ఘనకార్యాలకు తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని బహిరంగంగానే సిఫారసు చేసుకున్నారు. అయితే అప్పట్లో ఆయన చేసిన పనులు శాంతి రేపకపోగా అశాంతికి కారణం అయ్యాయని కనీసం లెక్కలోకి కూడా తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఆయన గట్టిగానే తనను తాను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇందుకు భారత్ పాకిస్తాన్ లను వాడుకుంటున్నారు.
తాను భారత్, పాక్ మధ్య అణుయుద్ధాన్ని నివారించానని లక్షల మంది ప్రాణాలు పోకుండా కాపాడానని ట్రంప్ ప్రకటించుకుంటున్నారు. వారి మధ్య యుద్ధాన్ని ఆపడానికి తాను బెదిరింపులకు కూడా దిగానన్నారు. అమెరికాలోనే కాదు..ఖతార్ పర్యటనకు వచ్చి అదే చెబుతున్నారు. అయితే తమ మధ్య అమెరికా ఎలాంటి మధ్యవర్తిత్వం చేయలేదని భారత్, పాకిస్తాన్ చెబుతున్నాయి. కానీ ట్రంప్ మాత్రం..తానే చేయించానని చెప్పుకుంటున్నారు. ఉక్రెయిన్, రష్యా మధ్య కూడా తానే ఉద్రిక్తతల్ని తగ్గించానని ఆయన ప్రచారం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. యుద్దం చేసి చేసి అలసిపోయిన ఆ రెండు దేశాలు.. ప్రస్తుతానికి కాల్పుల విరమణ పాటించాలని అనుకుంటున్నాయి. దీన్ని తన ఖాతాలో ట్రంప్ వేసుకోనున్నారు.
ట్రంప్ వ్యవహారం అమెరికా అధ్యక్షుడిగా వ్యక్తిగత లాభాలు పొందడానికి అన్నట్లుగా సాగుతోంది. ఆయన నిజంగా పెద్దన్న పాత్ర పోషించాలంటే.. దానికి వేరే మార్గాలున్నాయి. కానీ చిల్లర చిల్లర ప్రయత్నాలు చేసి..క్రెడిట్ కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీని వల్ల అమెరికా ఇమేజే ప్రపంచదేశాలు ముందు పోతోంది. అయినా ట్రంప్ మాత్రం.. తన మార్క్ తనదని అనుకుంటున్నారు.