బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి సుప్రీంకోర్టు స్పీకర్‌కు మరో మూడు వారాల గడువు ఇచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కారణంగా మరికొంత సమయం కావాలని స్పీకర్ లాయర్లు న్యాయస్థానాన్ని కోరారు. స్పీకర్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం, విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది.
ఇప్పటికే ఈ ప్రక్రియలో జాప్యం జరిగిందని అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం, స్పీకర్‌కు ఇదే చివరి అవకాశమని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి నెలాఖరుకు నిశ్చయించింది గడువులోగా పూర్తి చేయకపోతే స్పీకర్ పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలలో ఎనిమిది మందిపై దాఖలైన పిటిషన్లను స్పీకర్ కొట్టివేసినట్లు కోర్టు దృష్టికి వచ్చింది. మిగిలిన ఇద్దరు కీలక ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి కేసుల్లో ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోకపోవడంపై న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది.
ఒకవేళ ఇచ్చిన మూడు వారాల గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేసి నివేదిక సమర్పించకపోతే, స్పీకర్‌పై కోర్టు ధిక్కార చర్యలు చేపట్టాల్సి ఉంటుందని ధర్మాసనం ఘాటుగా హెచ్చరించింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్, నిర్ణీత కాలపరిమితిలోగా నిర్ణయాలు తీసుకోవాలని గుర్తుచేసింది. మరో మూడు వారాల్లో ఇద్దరిపై కూడా అనర్హతా పిటిషన్లు కొట్టివేసే అవకాశం ఉంది. ఆ తర్వాత స్పీకర్ నిర్ణయంపై కొత్తగా న్యాయపోరాటం బీఆర్ఎస్ చేయాల్సి ఉంది.


