ఐపీఎల్ అంటే ఫోర్లూ, సిక్సర్ల ఆటే కాదు. కోట్లాట కూడా. స్టార్ ఆటగాళ్లకు కోట్లకు కోట్లు పోసి కొంటుంటారు. ఎవరెంత ధరకు అమ్ముడుపోతే.. అంత పెద్ద స్టార్లన్నట్టు. లక్షల్లో కొనుక్కున్న ఆటగాళ్లని అస్సలు పట్టించుకోరు. వాళ్లంతా నామ్ కే వాస్తే. డగౌట్ లో కూర్చోవడానికీ, వాటర్ బాటిళ్లు అందించడానికీ వాళ్లని ఉపయోగించుకొంటుంటారు. వాళ్లంతా అండర్ డాగ్సే. కానీ.. అలాంటి వాళ్లు బరిలో దిగితే ఎలా ఉంటుందో రుచి చూపించింది హైదరాబాద్ Vs రాజస్థాన్ మ్యాచ్. ఈ పోరులో బరిలోకి దిగిన ప్రఫుల్, సకీబ్ అనే ఇద్దరు కొత్త బౌలర్లు… ప్రత్యర్థి బ్యాటర్లకు ఊపిరి ఆడనివ్వకుండా చేశారు. ప్రఫుల్ తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోని తొలి ఓవర్లోనే మూడు వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఓ బౌలర్ తన తొలి ఓవర్లోనే మూడు వికెట్లు తీయడం ఇదే తొలిసారి. మొత్తానికి ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి అదరగొట్టాడు ఈ కుర్రాడు. చిచ్చర పిడుగు లాంటి వైభవ్ సూర్యవంశీని తొలి బంతికే ఔట్ చేసి.. వావ్ అనిపించాడు. ఐపీఎల్ వేలంలో సన్ రైజర్స్ ఈ కుర్రాడిని కేవలం 30 లక్షలకు సొంతం చేసుకొంది.
ఇదే మ్యాచ్‌లో సకీబ్ కూడా అరంగేట్రం చేశాడు. ఈ బౌలర్‌ని సన్ రైజర్స్ కేవలం 20 లక్షలకు కొనుగోలు చేసింది. అయితేనేం.. ఆర్.ఆర్ని తన స్వింగ్ తో వణికించాడు. తన కూడా నాలుగు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి వెన్ను విరిచాడు. ప్రఫుల్ తో పోలిస్తే… సకిబ్ బౌలింగ్ లో మరింత వైవిధ్యం కనిపిస్తోంది. ఒక్కో బంతినీ ఒక్కోలా విసురుతున్నాడు సకిబ్. తొలి మ్యాచ్‌లోనే ఇద్దరు బౌలర్లు చెరో నాలుగు వికెట్లు తీయడంతో సన్ రైజర్స్ శిబిరంలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ప్రపంచ స్థాయి బౌలర్లు విఫలం అవుతున్న ఈ ఐపీఎల్ లో ఇద్దరు కుర్రాళ్లు తమ తొలి మ్యాచ్‌లోనే చెలరేగడం మిగిలిన జట్లకూ కొత్త ఉత్సాహాన్ని అందించినట్టైంది. మిగిలిన ఫ్రాంచైజీలు కూడా తమ అదనపు బలగాల్ని పరిక్షించడానికి అవకాశం దక్కింది.
ఈ సీజన్లో హైదరాబాద్ బ్యాటింగ్ పరంగా పటిష్టంగా కనిపిస్తోంది. బౌలింగ్ లో మాత్రం చాలా బలహీనంగా ఉంది. కాకపోతే ఈ కొత్త బౌలర్లతో ఇప్పుడు బౌలింగ్ దళం కూడా కొత్త బలాన్ని సంతరించుకొంది. ఇక హైదరాబాద్ ని ఆపడం కష్టమే.
