వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన నుంచి ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు ముప్పు పొంచి ఉందన్నారు. జగన్ మొదటి నుంచీ హత్య రాజకీయాలకు అలవాటు పడ్డారని, తన తాత రాజారెడ్డి నుంచి ఆ హత్యా రాజకీయాలను వారసత్వంగా పుణికిపుచ్చుకున్నారని ఆరోపించారు. అధికారం కోసం సొంత బాబాయి వివేకానంద రెడ్డిని కూడా హత్య చేయించి, ఆ కేసులను మాఫీ చేయించుకోవడానికి కుట్రలు పన్నారని విమర్శించారు. గతంలో తన తండ్రిని అడ్డుపెట్టుకుని పరిటాల రవితో పాటు ఆయన చుట్టూ ఉన్న అనేక మందిని జగన్ హత్య చేయించారని గోరంట్ల తీవ్ర ఆరోపణలు చేశారు.
ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ జగన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని గోరంట్ల హెచ్చరించారు. ప్రజా సమస్యలను నిరంతరం వెలుగులోకి తీసుకొస్తున్న రాధాకృష్ణపై జగన్ దాడి చేయించే ప్రమాదం ఉందని, ఆయన నుంచి ఆర్కేకు ప్రాణహాని ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ, తమకు వ్యతిరేకంగా వార్తలు రాసే వారిని టార్గెట్ చేయడం జగన్ నైజమని, అందుకే రాధాకృష్ణ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
రాజమండ్రిలో ఆదివారం జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా గోరంట్ల ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ తన ఐదేళ్ల పాలనలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో భారీగా ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. వైసీపీ హయాంలో జరిగిన భూ దోపిడీపై కూటమి ప్రభుత్వం తప్పకుండా విచారణ జరిపిస్తుందని, తప్పు చేసిన వారు ఎవరైనా సరే జైలుకు వెళ్లక తప్పదని ఆయన హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడటం వల్లే ప్రజలు వైసీపీని తిరస్కరించి, కూటమికి భారీ మెజారిటీ ఇచ్చారని గోరంట్ల గుర్తుచేశారు.
