తెలుగు రాజకీయం అంటేనే ఒక చురుకైన మేధస్సు.. నిరంతర శ్రమ.. వెనుకాడని పోరాట పటిమ గుర్తొస్తాయి. ఇవన్నీ ఒక్కచోట చేరితే నారా చంద్రబాబు నాయుడు . కేవలం ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా, ఒక దార్శనికుడిగా తెలుగు రాష్ట్రాల ముఖచిత్రాన్ని మార్చిన ఘనత ఆయనది.
రేపటి గురించి ఆలోచించేనేత చంద్రబాబు
చంద్రబాబు ఎప్పుడూ రేపటి గురించి ఆలోచించే నాయకుడు. 1990వ దశకంలోనే ఐటీ రంగం ప్రాముఖ్యతను గుర్తించి, హైదరాబాద్‌ను గ్లోబల్ మ్యాప్‌లో నిలబెట్టడం ఆయన విజన్‌కు నిదర్శనం. నేడు లక్షలాది మంది తెలుగు యువత ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తున్నారంటే, ఆనాడు ఆయన వేసిన పునాదులే కారణం. విజన్ 2020 నుంచి నేటి విజన్ 2047 వరకు, ఆయన ఆలోచనలన్నీ భావి తరాల ఉపాధి , రాష్ట్ర సంక్షేమం చుట్టూనే తిరుగుతాయి. అమరావతిని ఒక ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మించాలన్న ఆయన సంకల్పం, కేవలం ఇటుకల నిర్మాణమే కాదు, అది ఐదు కోట్ల ప్రజల ఆత్మగౌరవ ప్రతీక.
ప్రజాస్వామ్య బలోపేతం
చంద్రబాబు వ్యక్తిత్వంలో అతిపెద్ద గుణం ఓర్పు , పట్టుదల . నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితంలో ఆయన ఎన్నో గెలుపోటములను చూశారు. కానీ, ప్రజాస్వామ్య విలువల విషయంలో ఆయన ఎన్నడూ రాజీ పడలేదు. వ్యవస్థలను బలోపేతం చేయడం, టెక్నాలజీని పాలనలో భాగం చేయడం ద్వారా సామాన్యుడికి సేవలను దగ్గర చేశారు. రాజకీయాల్లో హుందాతనాన్ని కాపాడటంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. సంక్షోభ సమయాల్లోనూ సమయస్ఫూర్తితో వ్యవహరించి, ప్రజల్లో ధైర్యం నింపడం ఆయనకే చెల్లింది.
76 ఏళ్ల వయసులోనూ 26 ఏళ్ల ఉత్సాహం
చంద్రబాబు నాయుడుని చూస్తే అందరూ ఆశ్చర్యపోయే విషయం ఆయన పనితీరు. 76 ఏళ్ల వయసులో కూడా ఆయన రోజుకు 18 గంటల పాటు శ్రమిస్తారు. దీని వెనుక ఆయన కఠినమైన క్రమశిక్షణ ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. ఆయన తీసుకునే ఆహారం చాలా మితంగా, సమతుల్యంగా ఉంటుంది. నూనె వస్తువులకు, తీపి పదార్థాలకు ఆయన చాలా దూరం. ఎన్ని పనులున్నా, ఎంతటి రాజకీయ ఒత్తిడి ఉన్నా ఉదయాన్నే యోగా, ట్రెడ్‌మిల్‌పై వ్యాయామం చేయడం ఆయన దినచర్యలో భాగం. నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన ఆయనను మానసికంగా ఎప్పుడూ ఉత్సాహంగా ఉంచుతుంది. ఆయన ఆరోగ్యం పట్ల తీసుకునే శ్రద్ధ నేటి యువతకు ఒక పెద్ద సందేశం.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన పడ్డ తపన, నిరంతర ప్రజాసేవ ఆయనను కోట్లాది మంది గుండెల్లో నిలిపాయి. వ్యక్తిగత విమర్శలు ఎదురైనా, రాజకీయ కుట్రలు జరిగినా తన లక్ష్యం వైపు అడుగులు వేసే స్థితప్రజ్ఞత ఆయనకే సొంతం.
