తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుసరిస్తున్న మౌనం అటు కేడర్‌లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారితీస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాక ఆయన పూర్తిగా ఫామ్ హౌస్‌కే పరిమితం కావడం, కనీసం అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరుకాకపోవడంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు విరామం ప్రకటించారని అనుకుంటున్నారు. గతంలో మున్సిపల్ ఎన్నికల ముందు బహిరంగ సభలు నిర్వహిస్తామని ప్రకటించినా, అవి కార్యరూపం దాల్చకపోవడం కార్యకర్తల్లో నైరాశ్యాన్ని నింపింది. ఇప్పుడు జగిత్యాల సభ ద్వారా ఆయన మళ్లీ ప్రజల ముందుకు వస్తుండటంతో, కేసీఆర్ ఇకనైనా ఫుల్ టైమ్ రాజకీయాలు చేస్తారా? లేక ఇది కేవలం ఒక విజిట్ మాత్రమేనా అన్నది ఆసక్తికరంగా మారింది.
రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్
తెలంగాణలో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మూసీ ప్రక్షాళన నుంచి సంక్షేమ పథకాల వరకు ప్రతి విషయంలోనూ రేవంత్ తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ తరుణంలో కేసీఆర్ లాంటి బలమైన ప్రతిపక్ష నేత యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వస్తేనే రాజకీయాలు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా మారుతాయి. కేసీఆర్ బహిరంగ సభల్లో తన పదునైన విమర్శలతో రేవంత్ సర్కార్‌ను టార్గెట్ చేస్తేనే పార్టీకి పూర్వవైభవం వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ అజ్ఞాతం వీడితే తప్ప, పార్టీ నుంచి జరుగుతున్న వలసలను అడ్డుకోవడం, కేడర్‌లో ధైర్యం నింపడం సాధ్యం కాదు.
ఫామ్ హౌస్ రాజకీయాలకు స్వస్తి చెబుతారా?
బీఆర్ఎస్ నేతలకు ఉన్న అతిపెద్ద ఫిర్యాదు కేసీఆర్ అందుబాటులో ఉండకపోవడం. మధ్యమధ్యలో పార్టీ నేతలతో మాట్లాడిన వీడియోలను లీక్ చేయడం
మినహా, ఆయన నేరుగా ప్రజల సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాడిన సందర్భాలు గత ఏడాది కాలంగా తక్కువ. జగిత్యాల సభ తర్వాత కూడా ఆయన మళ్లీ ఫామ్ హౌస్‌కే పరిమితమైతే, బీఆర్ఎస్ గ్రాఫ్ మరింత పడిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ ఆయన పూర్తిస్థాయిలో యాక్టివ్ పాలిటిక్స్‌లోకి దిగి, ప్రజల పక్షాన నిలబడితే తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మొదలవుతుంది. లేకపోతే ఆ ప్రతిపక్ష హోదాను బీజేపీ ఆక్రమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
అసెంబ్లీకి వెళ్లకపోవడం పెద్ద మైనస్
రాజకీయ నేతకు ప్రజల్లో గుర్తింపు ఉండాలంటే నిరంతరం వార్తల్లో ఉండాలి. అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండటం కేసీఆర్ ఇమేజ్‌కు కొంత నష్టం చేకూర్చింది. గతంలో ఆయన పర్యటనలు అంటే ఒక రకమైన హైప్ ఉండేది, కానీ ఇప్పుడు అది తగ్గుముఖం పట్టింది. జగిత్యాల సభ ద్వారా ఆయన తన వాగ్ధాటితో ఆ పూర్వపు గ్లామర్‌ను మళ్లీ తీసుకురాగలరా అనేది చూడాలి. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర ఇంకా ముగిసిపోలేదని నిరూపించుకోవాలంటే, ఈ సభ తర్వాత ఆయన విరామం లేకుండా ప్రజల్లో ఉండటం అత్యవసరం. కేవలం ఒక సభతో ఆగిపోకుండా, వరుస పర్యటనలు, అసెంబ్లీలో పోరాటాలు చేస్తేనే రేవంత్ రెడ్డికి గట్టి పోటీ ఇవ్వగలరు. తెలంగాణ పౌర సమాజం కూడా ఒక బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటోంది. అంతా కేసీఆర్ చేతుల్లోనే ఉంది.
