పాపం… అక్కినేని అఖిల్ కి ఏం కలసి రావడం లేదు. తన ఖాతాలో ఓ నికార్సయిన హిట్ పడాలని ఆయనతో పాటు ఆయన అభిమానులు కూడా బలంగా కోరుకొంటున్నారు. అఖిల్ కూడా తన శక్తిమేర కష్టపడుతున్నాడు. కానీ ఫలితాలే రావడం లేదు. ఇప్పుడు అందరి దృష్టీ ‘లెనిన్’ పైనే. ఆరు నూరైనా లెనిన్ తో హిట్టు కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు అఖిల్. సితార నాగవంశీ కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని, సినిమాని తీర్చిదిద్దుతున్నారు. మే 1న రావాల్సిన సినిమా ఇది. ‘పెద్ది’ రిలీజ్ కోసం..వాయిదా వేసుకొన్నారు. జూన్ 26న రిలీజ్ చేద్దామనుకొన్నారు. తీరా చూస్తే ‘పెద్ది’ వాయిదా పడి, ఇప్పుడు సరిగ్గా జూన్ 25న రిలీజ్ కోసం ఎదురు చూస్తోంది. అంటే.. డేట్ మారినా ‘పెద్ది’ గండం నుంచి తప్పించుకోలేకపోయారన్నమాట.
జూన్ 25న ‘పెద్ది’ రావడం దాదాపు ఖాయమైన నేపథ్యంలో ఇప్పుడు అఖిల్ కి మరో కొత్త డేట్ చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. జూన్ 25 కంటే ముందే ఈ సినిమాని విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడు నాగవంశీ. దానికి తగ్గట్టుగానే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో స్పీడు పెంచుతున్నార్ట. అసలు ఇప్పటి వరకూ ఎంత మేర షూట్ అయ్యింది, ఇంకెంత బాకీ ఉంది, ఎన్ని రోజుల్లో ఫస్ట్ కాపీ వస్తుంది? ఈ విషయాలేవీ బయటకు రాలేదు. మే 1న రిలీజ్ కి రెడీ అయ్యారు కాబట్టి, ఈపాటికే షూటింగ్ పూర్తవ్వాలి. పోస్ట్ ప్రొడక్షన్ కి పెద్దగా సమయం కూడా పట్టదు. కాబట్టి జూన్ 26 కంటే ముందే ఈ సినిమాని రిలీజ్ చేయొచ్చు. ఇంకా ఆలస్యమైతే మాత్రం.. ఈమాత్రం ఆసక్తి కూడా పోయే ప్రమాదం ఉంది. కనీసం నెల రోజుల ముందు నుంచీ గట్టిగా ప్రమోట్ చేసుకొని, సినిమాని రిలీజ్ చేస్తే ఏమైనా ఫలితం ఉండొచ్చు. పెద్ది వచ్చి వెళ్లాక చూసుకొందాం అనుకొంటే, అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో?
