కొత్త తరహా ప్రయత్నాలకు పెట్టింది పేరు ధనుష్. యాక్షన్, లవ్ స్టోరీ, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిల్మ్.. ఇలా ఏదైనా చేసి మెప్పించగలడు. ఇప్పుడు తాను తమిళంలో చేసిన ‘కర’ తెలుగులో అనువాదమైంది. విఘ్నేష్ రాజా దర్శకుడు. మమిత బైజు కథానాయికగా నటించింది. ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రోజు టీజర్ వదిలారు.
‘‘పంటో.. గడ్డో
పాపమో..పుణ్యమో
తను నాటింది..తనే నరుక్కోవాలి
నేను నాటిన విత్తనం ఇప్పుడు కోత కొచ్చింది
అంత కంటే ముందు నామీద పడ్డ మచ్చని తుడిచేయాలి
నన్ను నమ్ముకున్న వారిని ముందుకు తీసుకెళ్లాలి
నా పేరు కరసామి’’ అంటూ ధనుష్ తన పాత్రని తాను పరిచయం చేసుకొన్నారు.
కథ, పాత్రీకరణ, సన్నివేశాల అల్లికలో సహజత్వం కనిపించింది. ఏదో బలమైన నేపథ్యంలోనే సినిమా తెరకెక్కినట్టు అర్థం అవుతోంది. ప్రతీ ఫ్రేమ్ లోనూ ఇంటెన్షన్ కనిపించింది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. త్వరలోనే ట్రైలర్ విడుదల చేస్తారు. ఈ కథ, అందులోని మిగిలిన పాత్రలకు సంబంధించిన క్లూ ఆ ట్రైలర్ లో కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికైతే టీజర్ తో ఆకట్టుకొనే ప్రయత్నం అయితే జరిగింది. ఇదే ఇంటెన్సిటీ సినిమాలోనూ ఉంటే ధనుష్ ఖాతాలో మరో హిట్ పడినట్టే.


