ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ కుంభకోణంలో కీలక పాత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కేసిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రభుత్వ మాజీ సలహాదారు కృష్ణమోహన్ రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డిలతో పాటు ఇతర నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర సిట్ ఇచ్చిన నివేదిక, సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో ఈ దాడులు జరుగుతున్నాయి.
సిట్ నివేదిక – వేల కోట్ల మనీలాండరింగ్
గత ప్రభుత్వ హయాంలో మద్యం సేకరణ, పంపిణీలో భారీ అక్రమాలు జరిగాయని సిట్ తన నివేదికలో స్పష్టం చేసింది. ముఖ్యంగా ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థను నిలిపివేసి, కేవలం నగదు రూపంలోనే లావాదేవీలు సాగించడం ద్వారా దాదాపు 3,500 కోట్ల నుండి 4,000 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ కుంభకోణం ద్వారా వచ్చిన నల్లధనాన్ని విదేశాలకు మళ్లించడమే కాకుండా, బినామీ కంపెనీల ద్వారా రియల్ ఎస్టేట్ ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ ప్రాథమిక ఆధారాలు సేకరించింది.
ఇప్పటికే కొన్ని ఆస్తుల జప్తు
ఈ కేసులో ఈడీ ఇప్పటికే దూకుడుగా వ్యవహరిస్తోంది. గత మార్చి నెలలో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి, మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి , ఇతరులకు చెందిన రూ. 441.63 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇందులో బ్యాంక్ బ్యాలెన్స్‌లు, ఫిక్స్డ్ డిపాజిట్లు , విలువైన భూములు ఉన్నాయి. సుమారు రూ. 1,048 కోట్ల మేర ముడుపులు చేతులు మారినట్లు మనీ ట్రయల్‌ను కూడా అధికారులు గుర్తించారు. మద్యం తయారీ సంస్థల నుంచి బలవంతంగా వసూలు చేసిన నగదు, బంగారం హైదరాబాద్‌లోని పలు రహస్య ప్రాంతాల్లో నిల్వ చేసినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.
కీలక నిందితుల చుట్టూ ఉచ్చు
తాజా సోదాల్లో ఈడీకి లభించే కీలక పత్రాలు, డిజిటల్ సాక్ష్యాలు ఈ కేసులో తదుపరి అరెస్టులకు దారితీసే అవకాశం ఉంది. ముఖ్యంగా ధనుంజయ్ రెడ్డి వంటి మాజీ ఉన్నతాధికారుల ప్రమేయంపై ఈడీ దృష్టి సారించింది. గత ప్రభుత్వంలోని కొందరు కీలక నేతల కనుసన్నల్లోనే ఈ సిండికేట్ నడిచిందని, షెల్ కంపెనీల ద్వారా నిధులను మళ్లించారని అధికారులు అనుమానిస్తున్నారు.
