మల్లారెడ్డి ఫ్యామిలీ బీజేపీలో చేరుతుందన్న ప్రచారానికి తెలివిగా చెక్ పెట్టారు ఆయన కోడలు ప్రీతిరెడ్డి. బీజేపీ ఆఫీసుకు వెళ్లి సంస్థాగత కార్యదర్శితో సమావేశమైన తరవాత బీజేపీలో చేరడం లేదని చెప్పారు. నిజానికి ఆమె ఏ పార్టీలో లేరు. రాజకీయాల్లో లేరు. కానీ మల్లారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే. కానీ ఆ పార్టీతో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. చాలా సార్లు తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నానని కూడా చెప్పారు.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ తరపున బరిలోకి దిగబోతున్నారనే విషయం రాజకీయ వర్గాల్లో ఇప్పటికే బహిరంగ రహస్యం. బీజేపీ అగ్రనేతలతో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ, పార్టీలో చేరికకు సంబంధించి ఇంకా ముహూర్తం ఖరారు కాలేదు. అందుకే, అటు బీఆర్ఎస్పై గౌరవం ఉందని చెబుతూనే, ఆ పార్టీలోనే శాశ్వతంగా ఉంటామని చెప్పకుండా ప్రీతిరెడ్డి చాలా జాగ్రత్తగా మాట్లాడారు.
మల్లారెడ్డి కుటుంబం తమ రాజకీయ భవిష్యత్తును బీజేపీతో ముడిపెట్టేందుకు సిద్ధమైందని ప్రీతిరెడ్డి పర్యటన ద్వారా పరోక్షంగా క్లారిటీ వచ్చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మల్లారెడ్డి కొనసాగుతున్నందున, సాంకేతిక కారణాలతో ఇప్పుడే అధికారికంగా కండువా కప్పుకోకపోయినా, తెరవెనుక మాత్రం అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతానికి గౌరవం అనే ముసుగులో పార్టీ మారే అంశాన్ని నాన్చుతున్నప్పటికీ, అంతర్గతంగా బీజేపీ గూటికి చేరేందుకు బలమైన పునాది పడింది.
బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన చేరికల మిషన్ ఊపందుకున్నప్పుడు అందరి కంటే ముందు వరుసలో మల్లారెడ్డి కుటుంబమే ఉండబోతోందన్నది ప్రీతిరెడ్డి తాజా వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. చేరడం లేదు అని చెబుతూనే బీజేపీ కార్యాలయానికి వెళ్లడం, భవిష్యత్తు ప్రణాళికలపై చర్చలు జరపడం ద్వారా కార్యకర్తలకు , ప్రత్యర్థి పార్టీలకు ఆమె ఒక గట్టి సంకేతాన్ని పంపారు. యూనివర్శిటీ కార్యక్రమాల కోసం అయితే రాజకీయ పార్టీల నేతల్ని.. అదీ సంస్థాగత కార్యదర్శుల్ని కలవాల్సిన అవసరం ఏమి ఉంటుంది!?
