పెట్రో ధరలు భారీగా పెరగబోతున్నాయని తరచూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఎప్పటికప్పుడు కేంద్రం దీన్ని ఖండిస్తోంది. కానీ అంతర్జాతీయ పరిణామాలు చూస్తే.. పెంచకుండా ఉండటం అసాధ్యంగా కనిపిస్తోంది. ఇప్పుడుపెంచకపోవడానికి కారణం కేవలం.. ఎన్నికలే. చివరి విడత పోలింగ్ బెంగాల్ లో 29న ముగుస్తుంది.ఆ తర్వాత పెంచకుండా ఉండరు.
అంతర్జాతీయ మార్కెట్లో ధరల మంట
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు కొద్ది రోజులుగా ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. తాజాగా బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 106 డాలర్ల మార్కును దాటింది. గత మార్చి నెలలో కేవలం 77 డాలర్ల వద్ద ఉన్న ధర, నెల రోజుల్లోనే దాదాపు 35 శాతం పెరిగింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న అనిశ్చితి ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల్లో దేశీయంగా చమురు ధరలు పెంచడం అనివార్యం.
ఎన్నికల కోడ్ – నిలిచిపోయిన ధరల పెరుగుదల
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 100 డాలర్లు దాటినప్పటికీ, భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు గత కొన్ని నెలలుగా స్థిరంగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలే. పశ్చిమ బెంగాల్లో చివరి విడత పోలింగ్ ఏప్రిల్ 29న ముగియనుంది. ఎన్నికల సమయంలో చమురు సంస్థలు సామాన్యులపై భారం పడకుండా ధరలను స్థిరంగా ఉంచడం, పోలింగ్ ముగిసిన వెంటనే సర్దుబాటు పేరుతో ధరలను భారీగా పెంచడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా అదే పునరావృతమయ్యే అవకాశం ఉంది.
చమురు సంస్థల నష్టాలు
అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు 120 డాలర్ల స్థాయికి చేరితే, దేశీయంగా లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలను 25 నుండి 28 వరకు పెంచితేనే చమురు సంస్థల నష్టాలు భర్తీ అవుతాయి. చమురు సంస్థలు ప్రతి నెలా దాదాపు రూ.27,000 కోట్ల వరకు అదనపు భారాన్ని మోస్తున్నాయని, ఎన్నికల తర్వాత ఈ భారాన్ని వినియోగదారులపైకి మళ్లించక తప్పదని చెబుతున్నారు. పెట్రో ధరల పెంపుపై వస్తున్న వార్తలను కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ కేవలం వదంతులని, అటువంటి ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని స్పష్టం చేసింది. కానీ ప్రభుత్వం కూడా ఎంతో కాలం భరించడం కష్టం. ప్రజల్ని దానికి రెడీ చేయలేకపోతున్నారు. ఈ లోపు యుద్ధం ఆగిపోయి.. క్రూడాయిల్ ధరలు తగ్గితే మాత్రం ప్రజలకు ఊరట లభించవచ్చు.
