‘డాన్ 3’ వివాదం చినికి చినికి గాలి వానగా మారి… రణవీర్ సింగ్ పై బాలీవుడ్ బ్యాన్ విధించే వరకూ వెళ్లింది. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో మొదలవ్వాల్సిన డాన్ 3లో ముందు రణవీర్ ని హీరో అనుకొన్నారు. పది కోట్ల అడ్వాన్సు ఇచ్చారు. రెండు మూడేళ్ల పాటు ఈ ప్రాజెక్ట్ పై వర్క్ జరిగింది. అయితే.. సినిమా ఆలస్యం అవ్వడం, తాను కోరిన మార్పులు చేయడానికి ఫర్హాన్ అక్తర్ ఒప్పుకోకపోవడంతో.. రణవీర్ ఈ సినిమా నుంచి తప్పుకొన్నారు. దాంతో… ఫర్హాన్ ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ సంఘాన్ని ఆశ్రయించాడు. వాదోపవాదనలు విన్న తరవాత.. ఎఫ్.డబ్యూ.ఐ.సీ… రణ్వీర్ పై బ్యాన్ విధించింది. తనకు, తన సినిమాలకూ బాలీవుడ్ నుంచి ఎలాంటి సహకారం ఇవ్వకూడదని నిశ్చయించుకొంది. ఇలాంటి నిషేధం.. రణవీర్ లాంటి టాప్ స్టార్ కి విధించడం బాలీవుడ్ లో చర్చనీయాంశం అయ్యింది. ఎప్పుడూ లేనిది.. ఓ స్టార్ ని బ్యాన్ చేయడం ఏమిటంటూ.. అక్కడ రచ్చ మొదలైంది. రణవీర్ తక్కువోడేం కాదు. తాను కూడా ధీటుగానే బదులు ఇస్తున్నాడు. అడ్వాన్సుగా తీసుకొన్న రూ.10 కోట్లు వెనక్కి ఇచ్చేశాడు. కానీ… చిత్రబృందం మాత్రం రణవీర్ తప్పుకొన్నందుకు రూ.45 కోట్ల నష్టపరిహారం అడుగుతోంది. అంత మొత్తం ఇవ్వడానికి రణవీర్ నిరాకరిస్తున్నాడు.
రణవీర్ నిషేధం నుంచి తప్పుకోవాలంటే నిర్మాత కోరిన మొత్తం ఇవ్వాలి. లేదంటే ‘డాన్ 3’ చేయడానికి ఒప్పుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇంత రచ్చ జరిగిన తరవాత ‘డాన్ 3’ ఎట్టి పరిస్థితుల్లోనూ రణవీర్ చేయడు. అలాగని 45 కోట్లు ఇవ్వడానికి కూడా రణవీర్ మనసు ఒప్పుకోవడం లేదు. అసలు స్క్రిప్టు వర్క్ పూర్తి కాలేదని, అలాంటప్పుడు.. ప్రీ ప్రొడక్షన్ కి రూ.45 కోట్లు ఎందుకు అవుతాయన్నది రణవీర్ ప్రశ్న. కూర్చుని మాట్లాడుకొంటే సమస్య పరిష్కారం అయిపపోతుందని, లేనిపోని ఈగోలకు పోయి రచ్చ రచ్చ చేసుకోవొద్దని రణవీర్ టీమ్ కూడా హితవు పలుకుతోంది. అయితే ఫర్హాన్ అక్తర్ బాగా మొండిగా ఉన్నాడని, అందుకే నష్టపరిహారమో, బ్యానో.. ఏదో ఒకటి తేలాల్సిందే అంటున్నాడని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఒక వేళ రణవీర్ పై నిషేధం అమలు చేస్తే… అదో పెద్ద సంచలనమే అవుతుంది. చాలామంది హీరోలు అప్రమత్తం అవుతారు. ఎందుకంటే… సినిమా ఓకే చేసి, అడ్వాన్సులు తీసుకొని, రేపు ముహూర్తం అనగా ‘నో’ చెప్పిన హీరోలు ఎంతోమంది కనిపిస్తారు. వాళ్లందరికీ.. ఇదో మేలు కొలుపు లాంటిది. ఇక ముందు అడ్వాన్సులు తీసుకోవాలంటే హీరోలు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని.. ప్రొసీడ్ అవుతారు. అది హీరోలకూ, నిర్మాతలకూ మంచిదే.
