ఎట్టకేలకు ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఖాయం అయ్యింది. జూన్ 19న ఈ సినిమాని విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే రెండుసార్లు రిలీజ్ డేట్ వాయిదా పడింది. ఈసారి పడే ఛాన్స్ లేదు. కాకపోతే.. జూన్ 19న విజయ్ సినిమా ‘జన నాయగన్’ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విజయ్ సినిమాకి ఈసారి తెలుగులోనూ మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ జననాయగన్ రిలీజ్ డేట్ ప్రకటిస్తే.. సమంతకు కష్టమే.
ఈ సినిమా కచ్చితంగా సమంత సత్తాకు పరీక్ష లాంటిదే. సోలో హీరోయిన్ గా సమంత కొన్ని సినిమాలు చేసింది. అయితే పెద్దగా రాణించింది లేదు. కాకపోతే.. ఈస్థాయి యాక్షన్ మాత్రం సమంత చేయలేదు. ఈ సినిమాకు నిర్మాత కూడా తనే. కాబట్టి.. మరింత ఒత్తిడి తనపై ఉంటుంది. రాజ్ నిడిమోరు ఈ చిత్రానికి కథ అందించారు. సమంతని సిల్వర్ స్క్రీన్ పై ఎలా చూపించాలో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి కథ విషయంలో తప్పు జరిగే ఛాన్స్ లేదు. నందినిరెడ్డి కి ఇలాంటి కథలు డీల్ చేయడం కొత్త. ఆమె ఎప్పుడూ సాఫ్ట్ కథలే చెప్పింది. ఈసారి యాక్షన్ డ్రామా విత్ ఎమోషన్స్ చూపించాల్సిన అవసరం ఏర్పడింది. తనకు కూడా ఈ స్క్రిప్టు ఛాలెంజే.
సమంత లాంటి టాప్ స్టార్లు లేడీ ఓరియెంటెడ్ కథలు మరిన్ని చేయాలి. అప్పుడు కొత్త కథలు పుట్టుకు వస్తాయి. అలా జరగాలంటే.. ఈ జోనర్ లో రెండు మూడు మంచి హిట్లు పడాలి. మొన్నామధ్య ‘ఘాటీ’ తో అనుష్క కూడా ఇలాంటి ప్రయత్నమే చేసింది. కానీ ఫలితం రాలేదు. ఇప్పుడు సమంత వంతు వచ్చింది. ఈసారి సమంత ఏం చేస్తుందో?