‘పెద్ది’లో పాటలన్నీ మార్మోగేలా డిజైన్ చేశాడు బుచ్చిబాబు. రెహమాన్ తో తెలుగు ప్రేక్షకుల అభిరుచికి, చరణ్ ఇమేజ్‌కీ తగ్గట్టుగా పాటలు రాబట్టుకొన్నాడు. ‘చికిరి’, ‘రై రై రారా’ వినగానే నచ్చేశాయి. ఎక్కడ చూసినా ఇవే పాటలు. ఇప్పుడు `హల్లో.. హల్లో` కూడా ఇన్స్టెంట్ హిట్టయ్యింది. ఐటెమ్ పాటలంటే తమనో, దేవిశ్రీనో గుర్తుకు వస్తారు. అయితే… రెహమాన్ తన స్టైల్ లోనే ఐటెమ్ పాట కంపోజ్ చేశాడు. బీట్స్ తో, వాయిద్యాలతో హోరెత్తించకుండా ఈ పాటని సొగసుగా డిజైన్ చేశాడు. ఇనిస్ట్రిమెంటేజేషన్లో తన మార్క్ స్పష్టంగా కనిపించింది.
అనంత శ్రీరామ్ కూడా పాడుకొనేలానే సాహిత్యాన్ని అందించాడు. ఐటెమ్ పాటలు ఇవ్వడంలో సుకుమార్ ది ఓ స్టైల్. ఐటెమ్ పాటైనా సరే, అందులో ఓ థీమ్ కనిపిస్తుంది. బుచ్చిబాబు కూడా అదే ఫాలో అయ్యాడు. అందంతో అబ్బాయికి అమ్మాయిలు ఎర వేసే పాట ఇది. నెమరేసుకోవడానికి మెమొరీలే లేకపోతే.. ఇక లైఫ్ ఎందుకు అనే ఫిలాసఫీ టచ్ చేస్తూనే, మాస్‌కి నచ్చేలా పాట రాశారు. ‘చీరా చొక్కా చిక్కడిపోవాలోయ్..’ అనే క్వాయినింగ్ బాగుంది.
”సుఖమిట్టా పోగేసేయ్..
ఇపుడే అది వెనకేసేయ్
ముసలాడివి అయ్యాక
మురిపెంగా అవి నెమరేసేయ్” – ఇలా చిన్న చిన్న పదాలతోనే శ్రోతల్ని ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు అనంత శ్రీరామ్. మొత్తానికి ఈ పాట కూడా సిక్సరే. జాన్వీ, శ్రుతి కలిసి చరణ్‌తో వేసిన సిగ్నేచర్ స్టెప్పులు వెండి తెరపై ఎలా ఉండబోతున్నాయో అనే ఆత్రుతతో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ పాట హోరెలా ఉంటుందో తెలియాలంటే జూన్ 4 వరకూ ఆగాల్సిందే.
