ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా విస్తరిస్తున్న ఈ కాలంలో ఉద్యోగుల మనసుల్లో ఒకే ప్రశ్న తిరుగుతోంది.. “మన ఉద్యోగం సురక్షితమేనా?” కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువత నుంచి ఇప్పటికే సంస్థల్లో పని చేస్తున్న అనుభవజ్ఞుల వరకు అందరిలోనూ ఇదే ఆందోళన కనిపిస్తోంది. ముఖ్యంగా ఎంట్రీ లెవల్ ఉద్యోగాలపై ఏఐ ప్రభావం ఎక్కువగా ఉంటుందనే అంచనాలు, కంపెనీల నిర్ణయాలు ఉద్యోగుల్లో భయాందోళనలను పెంచుతున్నాయి.
సాఫ్ట్వేర్ కంపెనీల నుంచి బ్యాంకింగ్, మొబైల్ టెక్నాలజీ, ఈ-కామర్స్, సోషల్ మీడియా, హెల్త్‌కేర్ వరకు దాదాపు ప్రతి రంగంలోనూ ఏఐ వినియోగం వేగంగా పెరుగుతోంది. ఇప్పటికే ప్రపంచంలోని కొన్ని ప్రముఖ సంస్థలు తమ కార్యకలాపాల్లో ఏఐని విస్తృతంగా ఉపయోగిస్తున్నట్లు ప్రకటించాయి. కొన్ని విభాగాల్లో మానవ వనరుల అవసరాన్ని తగ్గిస్తూ ఆటోమేషన్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో ఉద్యోగాల పరిస్థితి ఎలా ఉంటుందోననే అనిశ్చితి ఉద్యోగులను వెంటాడుతోంది.
ఇలాంటి సమయంలో ప్రపంచ ఏఐ విప్లవానికి కేంద్రబిందువుగా నిలిచిన ఓపెన్ఏఐ సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్మాన్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఏఐ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, అది ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలను పూర్తిగా తుడిచిపెట్టేస్తుందనే భయం అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు తాను ఊహించినంత స్థాయిలో వైట్ కాలర్ ఉద్యోగాలను ఏఐ భర్తీ చేయలేదని అంగీకరించారు.
ఆల్ట్మాన్ వ్యాఖ్యల్లో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. సాంకేతికంగా ఏఐ చాలా పనులను వేగంగా చేయగలిగినా, ఉద్యోగాల్లో ఉండే మానవీయ కోణాన్ని పూర్తిగా భర్తీ చేయడం అంత సులభం కాదని ఆయన చెప్పడం. నిర్ణయాలు తీసుకోవడం, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, అవగాహన వంటి అంశాల్లో మనిషి పాత్ర కీలకంగానే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
నిజానికి గతంలో శామ్ ఆల్ట్మాన్ చేసిన కొన్ని వ్యాఖ్యలే ఉద్యోగ మార్కెట్లో పెద్ద చర్చకు దారితీశాయి. భవిష్యత్తులో అనేక ఉద్యోగాలను ఏఐ భర్తీ చేసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించడంతో చాలామంది ఆందోళన చెందారు. అదే సమయంలో అనేక సంస్థలు కూడా ఆటోమేషన్ వైపు అడుగులు వేయడం ఆ భయాన్ని మరింత పెంచింది.
అయితే ఇప్పుడు ఆల్ట్మాన్ స్వయంగా తన అంచనాలు కొంత మేరకు అతిశయోక్తిగా ఉన్నాయని చెప్పడం గమనార్హం. ఏఐ ఉద్యోగాల స్వరూపాన్ని మార్చవచ్చేమోగానీ, మనిషిని భర్తీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఇది ఉద్యోగులకు కొంత ఊరటనిచ్చే అంశమే.
అయితే దీన్ని ఏఐ ప్రభావం లేదనే అర్థంలో తీసుకోలేం. భవిష్యత్తులో ఉద్యోగులు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, ఏఐతో కలిసి పనిచేసే సామర్థ్యాన్ని పెంచుకోవడం తప్పనిసరి. ఉద్యోగాలను పూర్తిగా తొలగించే శక్తిగా కాకుండా, పని విధానాన్ని మార్చే సాధనంగా ఏఐని చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.
మొత్తానికి శామ్ ఆల్ట్మాన్ తాజా వ్యాఖ్యలు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఏఐ ఉద్యోగాల ప్రపంచాన్ని మార్చవచ్చు.. కానీ మనిషిని పూర్తిగా భర్తీ చేయడం మాత్రం అంత తేలిక కాదు. అదే ప్రస్తుతం ఉద్యోగులకు ఊరట కలిగిస్తోంది.
