సోమవారం రెండు సినిమాలకు సంబంధించిన ట్రైలర్లు బయటకు వచ్చాయి. ఒకటి.. ‘బ్లాస్ట్’, మరోటి ‘మా ఇంటి బంగారం’. అర్జున్, అభిరామి, ప్రీతీ ముకుందన్ కలిసి నటించిన ‘బ్లాస్ట్’. సమంత ప్రధాన పాత్రధారిగా రూపొందిన చిత్రం ‘మా ఇంటి బంగారం’. రెండు కూడా ఫ్యామిలీ టచ్ ఉన్న యాక్షన్ కథలు. ఈ రెండు సినిమాల లైన్లు ఇంచు మించు ఒక్కటే. తమ కుటుంబాన్ని కాపాడుకోవడానికి వాళ్లు ఎంతదూరమైనా వెళ్తారు. పైగా సాధారణంగా, సామాన్యంగా కనిపించే ఆడవాళ్లు… యాక్షన్ బరిలోకి దిగితే.. తక్కు రేగ్గొడతారు. ఇదీ కాన్సెప్టు. `మా ఇంటి బంగారం`లో సమంత క్యారెక్టరైజేషన్, ‘బ్లాస్ట్’ లో అభిరామి, ప్రీతీల పాత్ర తీరుతెన్నులు దాదాపు ఒకేలా కనిపిస్తున్నాయి. కాకపోతే.. వాళ్ల బ్యాక్ స్టోరీలు వేరు కావొచ్చు. రెండు సినిమాల ట్రైలర్లు ఒకే రోజు విడుదల అవ్వడం కాకతాళీయమే.
అయితే.. ‘ఆదర్శ కుటుంబం’ కథ కూడా ఇలానే ఉండబోతోందన్న టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం’. ఇది కూడా ఫ్యామిలీ డ్రామానే. కానీ ఇందులోనూ యాక్షన్ ఉంది. శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. తన పాత్ర కూడా యాక్షన్ టచ్ తో సాగుతుందట. తను కూడా ఫైటింగులు చేస్తుందట. హీరో, హీరోయిన్లు పైకి సాధారణంగా కనిపిస్తున్నా, వాళ్లు బ్యాక్ డ్రాప్ పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. సో.. ఈ మూడు కథల నేపథ్యాలు ఒక్కటిగానే అనిపిస్తున్నాయి. ‘బ్లాస్ట్’, ‘మా ఇంటి బంగారం’ 3 వారాల గ్యాప్ లో విడుదల అవుతున్నాయి. సో.. పోలికలు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ‘ఆదర్శ కుటుంబం’ రావడానికి టైమ్ ఉంది కాబట్టి… ఆ సినిమా వచ్చేలోగా ఈ రెండింటినీ మర్చిపోతారు. కథాంశం ఒక్కటా, కాదా అనేది `ఆదర్శ కుటుంబం` గ్లింప్స్ విడుదలైతే కానీ తెలీదు.


