ఈరోజుల్లో పెద్ద సినిమాల్నే పట్టించుకొనే నాధుడు లేడు. చిన్న, మీడియం సినిమాలు ఫోకస్ లోకి రావడానికి, ప్రేక్షకుల కంట్లో పడడానికి నానా తిప్పలు పడుతున్నాయి. పెద్ద సినిమా వచ్చినా, మూడ్రోజుల ముచ్చటే. అదీ కంటెంట్ బాగుంటేనే. అలాంటిది ఓ చిన్న సినిమా వంద కోట్ల టార్గెట్ ని ఫిక్స్ చేసుకొంది. ‘ఈ సినిమాతో వంద కోట్లు కొడతాం’ అని సదరు నిర్మాతే బాహాటంగా ప్రకటించేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది చాలా పెద్ద స్టేట్ మెంట్ కిందే లెక్క.
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన సినిమా ‘చెన్నై లవ్ స్టోరీ’. సాయిరాజేష్, ఎస్కేఎన్, ధీరజ్ మొగలినేని నిర్మాతలుగా ఈ సినిమాని రూపొందించారు. ఇప్పటి వరకూ రెండు పాటలు వచ్చాయి. మణిశర్మ అందించిన రెండు పాటలూ ఇన్స్టంట్ హిట్లే. మరో 5 పాటలు రావాల్సివుంది. ఆ 5 పాటలూ ఒకదాన్ని మించి మరోటి ఉండబోతున్నాయని టాక్. ఆడియో పరంగా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయం అనిపిస్తోంది. కంటెంట్ పై కూడా చిత్రబృందం గట్టి నమ్మకంతో ఉంది. అందుకే నిర్మాత ధీరజ్ మొగలినేని డాషింగ్ స్టేట్ మెంట్ ఇవ్వగలిగారు ‘ఈ యేడాది విడుదలైన లవ్ స్టోరీల్లో మాది బిగ్గెస్ట్ హిట్ అవుతుంది.. వంద కోట్లు కొడుతున్నాం’ అని స్టేజ్ మీదే ప్రకటించేశారు.
‘`బేబీ’ లాంటి సినిమా తీసిన సాయి రాజేష్ ఈ చిత్రానికి కథ అందించారు. ఆయనపై ప్రేక్షకులకు గురి ఉంది. చిన్న సినిమా అయినా సరే… బాక్సాఫీసు దగ్గర క్లిక్ అయితే కాసుల వర్షం కురుస్తుంటుంది. పైగా యూత్ ఫుల్ స్టోరీలకు ఇంకా అడ్వాంజేట్ ఉంటుంది. బేబీ బాక్సాఫీసు దగ్గర ఏం చేసిందో తెలిసిందే. సో.. అదే నమ్మకం ఈ సినిమా చిత్రబృందాన్నీ ముందుకు నడిపిస్తోంది.