అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి అనంతపురం రూరల్ పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. గతంలో జిల్లాలో తీవ్ర కలకలం రేపిన తోపుదుర్తి మహేశ్వర్ రెడ్డి అనుమానాస్పద మృతి) కేసుకు సంబంధించి లభించిన పక్కా ఆధారాలతోనే ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. రాజశేఖర్ రెడ్డితో పాటు ఈ కేసులో నిందితుడిగా ఉన్న జైపాల్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గత ఏడాది తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి అనే యువకుడు సోమలదొడ్డి గ్రామ సమీపంలోని రైల్వే పట్టాలపై తీవ్ర గాయాలతో మృతి చెందాడు. అప్పట్లో అప్పటి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వర్గంపై, వారి రాజకీయ విధానాలపై మహేశ్వర్ రెడ్డి సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టాడు. ఈ కారణంగా మాజీ ఎమ్మెల్యే సోదరుడైన రాజశేఖర్ రెడ్డి.. సదరు యువకుడిని తీవ్రంగా మందలించడంతో పాటు ప్రాణభీతి కలిగేలా బెదిరింపులకు పాల్పడ్డారని మృతుడి తండ్రి మలిరెడ్డి అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ బెదిరింపుల వల్లే భయపడిపోయి తన కుమారుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు.
ఈ కేసును తొలుత రైల్వే పోలీసులు నమోదు చేశారు. ఆ తర్వాత అనంతపురం రూరల్ , రాప్తాడు పోలీసులు సంయుక్తంగా విచారణ చేపట్టారు. మృతుడి తండ్రి మలిరెడ్డి సమర్పించిన ఫిర్యాదుతో పాటు, రాజశేఖర్ రెడ్డి బెదిరింపులకు పాల్పడినట్లు చెబుతున్న కొన్ని కీలక ఆడియో, వీడియో రికార్డులను, డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డిజిటల్ సాక్ష్యాధారాల నిశ్చితత్వం కోసం వాటిని ముంబైలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ) కి పంపించారు. ఇటీవల ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి వచ్చిన శాస్త్రీయ నివేదికలో ఆ వాయిస్ రికార్డింగులు రాజశేఖర్ రెడ్డివేనని ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో పోలీసులు ఈ అరెస్టులు ప్రారంభించారు.
ఈ ఉదయం రాజశేఖర్ రెడ్డి, జైపాల్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్న రూరల్ పోలీసులు వారిని స్టేషన్కు తరలించి ప్రశ్నించారు. అనంతరం జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ కేసులో మరికొంతమంది కీలక నేతలను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ప్రచారంతో అనంతపురం జిల్లా రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ, ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
