సొంతింటి కల నిజం చేసుకోవాలనుకునే కొనుగోలుదారులకు, గృహ నిర్మాణ రంగానికి బ్యాంకింగ్ రంగం నుంచి ఒక నిశ్శబ్ద షాక్ తగిలింది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా దేశంలోని కొన్ని ప్రధాన బ్యాంకులు హౌసింగ్ లోన్ నిబంధనలను సవరించాయి. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ , గుర్తింపు పొందిన సంస్థల నుంచి గ్రీన్ రేటింగ్ సర్టిఫికేషన్ పొందిన ప్రాజెక్టులకే తక్కువ వడ్డీ రేట్లతో, వేగంగా లోన్లు మంజూరు చేస్తున్నట్లు ఆర్థిక రంగానికి సంబంధించిన అంతర్గత నివేదికలు వెల్లడిస్తున్నాయి.
సాధారణ బిల్డర్లకు సమాచార లోపం
బ్యాంకులు పర్యావరణ అనుకూల ప్రాజెక్టులకు ఇస్తున్న ఈ ప్రాధాన్యత గురించి క్షేత్రస్థాయిలో ఉన్న చిన్న, సాధారణ బిల్డర్లకు కనీస అవగాహన లేకపోవడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. చాలా మంది డెవలపర్లు ఎప్పటిలాగే మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి సాధారణ అనుమతులు తీసుకుని ప్రాజెక్టులను ప్రారంభించేశారు. విద్యుత్ పొదుపు, వర్షపు నీటి నిల్వ, పచ్చదనం వంటి ‘గ్రీన్ బిల్డింగ్’ ప్రమాణాలను పత్రాల్లో పక్కాగా పొందుపరచకపోవడంతో.. సదరు నిర్మాణాలకు ఐజీబీసీ రేటింగ్ దక్కడం లేదు.
కస్టమర్లకు తప్పని లోన్ క్లియరెన్స్ తిప్పలు
ఈ విధానపరమైన మార్పుల వల్ల అంతిమంగా బడ్జెట్ ఇళ్లను నమ్ముకున్న మధ్యతరగతి కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాము ఇష్టపడి బుక్ చేసుకున్న అపార్ట్‌మెంట్‌కు లోన్ కోసం బ్యాంకులను ఆశ్రయించినప్పుడు.. గ్రీన్ రేటింగ్ పత్రాలు లేవనే సాకుతో బ్యాంకర్లు ఫైళ్లను పక్కన పెడుతున్నారు. ఒకవేళ లోన్ మంజూరైనా.. కన్సెషన్ రేట్లు వర్తించకపోగా, సాధారణ ప్రాజెక్టుల స్క్రీనింగ్ పేరుతో క్లియరెన్స్ ప్రక్రియ వారాల తరబడి ఆలస్యమవుతోంది. దీంతో సకాలంలో బిల్డర్లకు పేమెంట్లు చేయలేక కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు.
త్వరపడాల్సిన క్రెడాయ్, బిల్డర్ల సంఘాలు
మారుతున్న గ్లోబల్ బ్యాంకింగ్ ప్రమాణాలకు అనుగుణంగా స్థానిక నిర్మాణ రంగం కూడా తక్షణమే అప్డేట్ కావాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఐజీబీసీ న్ రేటింగ్ సర్టిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? దానికి ప్రాజెక్ట్ డిజైనింగ్ లోనే ఎలాంటి మార్పులు చేయాలి? అనే అంశాలపై క్రెడాయ్ వంటి బిల్డర్ల సంఘాలు చిన్న, మధ్యతరహా బిల్డర్లకు ప్రత్యేక వర్క్‌షాప్‌ల ద్వారా అవగాహన కల్పించాలి. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో సాధారణ పర్మిషన్లతో కట్టే ప్రాజెక్టులలో సేల్స్ పడిపోవడంతో పాటు, కస్టమర్లకు లోన్లు రాక మొత్తం మార్కెట్ మందగించే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వినవస్తున్నాయి.
