రాజకీయాల్లో తాత్కాలిక తాయిలాలు, హడావుడి కార్యక్రమాల కంటే.. సమాజానికి దీర్ఘకాలికంగా ఉపయోగపడే మౌలిక అంశాలపై దృష్టి పెట్టినప్పుడే ఏ నాయకుడికైనా నిజమైన గుర్తింపు, చరిత్రలో శాశ్వత స్థానం లభిస్తాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన గోదావరి ప్రక్షాళన ప్రయత్నాలు ఆ దిశగా సాగుతున్నాయి. గోదావరి పుష్కరాలు-2027 నిర్వహణ బాధ్యతలను భుజానకెత్తుకున్న పవన్.. కేవలం రేవులు కట్టడం, రంగులు వేయడం లాంటి తాత్కాలిక పనులకు పరిమితం కాకుండా, గోదావరి నదిని కాలుష్య కోరల నుండి శాశ్వతంగా విముక్తి చేయడమే తన అసలు లక్ష్యమని ప్రకటించారు.
రాజమహేంద్రవరం పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం కూడా గోదావరి కాలుష్యాన్ని పరిశీలించారు. నదిని తల్లిగా పూజిస్తాం.. కానీ వ్యర్థాలన్నీ అందులోనే వేస్తాం.. మురికినీళ్లలో స్నానం చేసి భక్తులు పుణ్యం వచ్చిందనుకుంటే ఎలా అంటూ పవన్ మండిపడ్డారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా, రాబోయే 6 నెలల కాలంలో గోదావరి జలాల నాణ్యతలో కంటికి కనిపించే మార్పు రావాలని డెడ్లైన్ విధించారు. పరిశ్రమలు కచ్చితంగా జీరో డిశ్చార్జ్ విధానాన్ని పాటించాలని, ఆంధ్ర పేపర్ మిల్స్ వంటి పెద్ద సంస్థల వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. అలాగే, నది తీరంలోని 285 పంచాయతీల అభివృద్ధికి, కాలుష్య నివారణకు తన పరిధిలోని పంచాయతీరాజ్ శాఖ నుండి రూ. 100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించి నిధుల కొరత లేకుండా చూశారు.
పవన్ కల్యాణ్ పర్యావరణ శాఖ మంత్రిగా తనకున్న అధికారాలను వాడుకుంటూ.. రూ. 416 కోట్ల కేంద్ర ప్రభుత్వ ఎన్ఆర్సీపీ నిధులతో అత్యాధునిక మురుగునీటి శుద్ధి ప్లాంట్లు నిర్మించి, నదిని శాశ్వతంగా క్లీన్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. పుష్కరాల జాతర ముగిసినా, నది స్వచ్ఛత అనేది తరతరాలకు నిలిచిపోయే ఒక వరం. ఈ ఆరు నెలల డెడ్లైన్లో పవన్ అనుకున్నట్లుగా గోదావరి కాలుష్యం అదుపులోకి వచ్చి, నదీ ప్రక్షాళన విజయవంతమైతే.. గొప్ప విజయం సాధించినట్లే అనుకోవచ్చు. గోదావరిని కాలుష్యం బారి నుంచి కాపాడేందుకు చాలా మంది ప్రయత్నించారు కానీ సక్సెస్ కాలేదు. అయితే ఈ ప్రయత్నంలో సాధారణ ప్రజలు కూడా సంకల్పం పెట్టుకుంటే.. లక్ష్యం సెలువే!
