దర్శకరత్న దాసరి నారాయణరావు స్మారక సమాధి నిర్లక్ష్యానికి గురైందంటూ ఒక ఛానల్ హడావుడి చేస్తూ ఇండస్ట్రీపై నిందలేయడం ప్రారంభించింది. ఇండస్ట్రీ పెద్దలకు, దాసరి శిష్యులకు అసలు కృతజ్ఞత లేదా అంటూ పెద్ద పెద్ద మాటలే మాట్లాడారు. ఈ హడావుడి కథనాలు రాగానే నటుడు మంచు మనోజ్ స్వయంగా వెళ్లి అక్కడ క్లీన్ చేసినట్లుగా సోషల్ మీడియాలో విజువల్స్ రావడం, మరికొందరు వెళ్లడం పెద్ద చర్చకు దారితీసింది. అయితే, ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక అసలు బాధ్యత ఎవరిది?
దాసరి నారాయణరావు సమాధి ఏ పబ్లిక్ స్థలంలోనో లేదా ఏదైనా చారిటబుల్ ట్రస్ట్ ఆధీనంలోనో లేదు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో ఉన్న ఆయన సొంత ఫామ్‌హౌస్‌లో, ప్రైవేట్ ల్యాండ్‌లో ఆ సమాధి ఉంది. చట్టబద్ధంగా, నైతికంగా ఒక వ్యక్తి ప్రైవేట్ ఆస్తిని, సమాధిని చూసుకోవాల్సిన ప్రాథమిక బాధ్యత ముమ్మాటికీ ఆయన కుటుంబ సభ్యులదే అవుతుంది. పైగా ఆ ఫామ్‌హౌస్ ప్రైవేట్ ప్రాపర్టీ కావడం వల్ల చుట్టూ కాంపౌండ్ వాల్స్, సెక్యూరిటీ ఉంటాయి. దాసరి కుటుంబ సభ్యుల అనుమతి లేనిదే బయటి వ్యక్తులుగానీ, టాలీవుడ్ ప్రముఖులు గానీ, చివరికి ఆయన పరమ శిష్యుడైన మోహన్ బాబు అయినా సరే నేరుగా లోపలికి వెళ్లి ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టే అవకాశం ఉండదు.
ప్రస్తుతం దాసరి వారసుల మధ్య ఉన్న కొన్ని అంతర్గత ఆస్తి తగాదాలు, కోర్టు వివాదాల కారణంగానే ఆ ఫామ్‌హౌస్ పర్యవేక్షణ లోపించిందనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. కుటుంబ సభ్యులే పట్టించుకోకుండా వదిలేసిన ఒక ప్రైవేట్ ఆస్తి విషయంలో.. సినీ పరిశ్రమ ఏం చేస్తోంది? మోహన్ బాబు ఎందుకు స్పందించడం లేదు? శిష్యులు ఎటు పోయారు? అంటూ పరిశ్రమ మొత్తాన్ని తప్పుబట్టడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పరిశ్రమకు చెందిన ఒక పెద్దాయనను గౌరవించడం వేరు, ఆయన వ్యక్తిగత ఆస్తుల నిర్వహణ బాధ్యతను ఇండస్ట్రీ నెత్తినేయడం వేరని కొందరు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
ఎనిమిదేళ్ల క్రితం చనిపోయిన ఒక మహోన్నత దర్శకుడి సమాధి అంశం హఠాత్తుగా ఇప్పుడు, అదీ ఒక కొత్త ఛానల్ ద్వారా ఇంత పెద్ద ఎత్తున తెరపైకి రావడం వెనుక ఏదో పెద్ద స్క్రిప్ట్ ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. సదరు ఫామ్‌హౌస్ ల్యాండ్స్ లేదా దాసరి ఆస్తులకు సంబంధించిన ఏదైనా పెద్ద రియల్ ఎస్టేట్ డీల్ తెరవెనుక నడుస్తోందా? లేదా ఆ డీలింగ్స్‌లో ఏవైనా తేడాలు రావడం వల్లే ఇలాంటి సెంటిమెంట్ కథనాలతో ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పబ్లిసిటీ కోసమో, బ్లాక్మెయిల్ పాలిటిక్స్ కోసమో దాసరి లాంటి మహానుభావుడి పేరును, సమాధిని వివాదాల్లోకి లాగడం సరికాదని టాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


