ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రముఖ జాతీయ వార్తా సంస్థ ANI పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో దేశ రాజకీయాలపై అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ , రేవంత్ లేవనెత్తుతున్న ఉత్తరాది వర్సెస్ దక్షిణాది వివాదాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఒక జాతీయ పార్టీ అయి ఉండి కూడా కాంగ్రెస్ ప్రాంతీయ పక్షపాతాన్ని ప్రోత్సహించడం విడ్డూరంగా ఉందన్నారు. దశాబ్దాలుగా హైదరాబాద్‌లోనే ఉంటూ, ఇక్కడి సమాజంతో మమేకమైన తనను కాంగ్రెస్ నేతలు కొందరు అవుట్‌సైడర్ అని పిలవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ గనుక నన్ను హైదరాబాద్ రాకూడదని చెబితే.. అప్పుడు నేను కూడా రాహుల్ గాంధీకి ఒక విషయం చెప్పాల్సి ఉంటుంది. రాహుల్ గాంధీ కూడా భారతదేశంలోని దక్షిణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు.. ఆయన ఉత్తరాది వ్యక్తి, మరి ఆయన ఇక్కడికి ఎలా వస్తారు అని పవన్ ప్రశ్నించారు. ప్రాథమిక హక్కులు, జాతీయ విలువల గురించి మాట్లాడే జాతీయ పార్టీలు ఇటువంటి సంకుచిత రాజకీయాలకు పాల్పడటం దేశ సమగ్రతకే ప్రమాదకరమని హెచ్చరించారు. తన మాతృభూమిలో తాను ఎక్కడికైనా వెళ్లే హక్కు తనకు ఉందని, ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఇక దేశంలో రాబోయే నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ , ఇతర దక్షిణాది నేతలు వ్యక్తపరుస్తున్న ఆందోళనలపై కూడా పవన్ కల్యాణ్ స్పందించారు. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు.. నియోజకవర్గాల విభజన వల్ల లోక్‌సభ స్థానాలను, రాజకీయ ప్రాధాన్యతను కోల్పోతామనే భయాన్ని వ్యక్తం చేయడంలో ఒక అర్థం ఉందని ఆయన అంగీకరించారు. అయితే, ఆ సమస్యను కేవలం సాంకేతిక, పరిపాలనాపరమైన కోణంలో చర్చించాలే తప్ప.. దానిని సాకుగా తీసుకుని ఉత్తరాది – దక్షిణాది విభేదాలను మధ్యలోకి తీసుకురావాల్సిన అవసరం ఎక్కడుందని ఆయన నిలదీశారు.
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ముఖ్యమంత్రులు దేశాన్ని ముక్కలు చేసే విధంగా మాట్లాడటం సరికాదని, అటువంటి వ్యాఖ్యలను ఖచ్చితంగా తిప్పికొట్టాలని పవన్ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ గుజరాత్ నుండి వచ్చారని, యావత్ దేశాన్ని ఏకం చేసిన సర్దార్ పటేల్ మాతృభాష హిందీ కాదని గుర్తు చేశారు. భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వమని.. భాష, ప్రాంతాల పేరుతో విభజన రాజకీయాలు చేస్తే సైన్యం కూడా సరిగ్గా పనిచేయలేని పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయవాద భావజాలంతో పెరిగిన వ్యక్తిగా దేశ ప్రయోజనాలే తనకు ముఖ్యమని, తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ.. తన పార్టీ క్యాడర్ ద్వారా అక్కడి అభివృద్ధికి కట్టుబడి ఉంటానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.


